‘పాండవులు సంపాదించింది అంతా కౌరవవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లు’.. హరీశ్‌ విమర్శలకు సీతక్క కౌంటర్

పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికి సరిపోయిందన్న చందగా తమ ప్రభుత్వం పరిస్థితి ఉందని మంత్రి సీతక్క అన్నారు. గత బీఆరెస్‌ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నదని చెప్పారు.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 23, 2026 9:30 PM IST
‘పాండవులు సంపాదించింది అంతా కౌరవవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లు’.. హరీశ్‌ విమర్శలకు సీతక్క కౌంటర్
  • వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
  • పదేండ్ల అధికారంలో మీరెందుకు చేయలేదని ప్రశ్న

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం బడ్జెట్ పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత టీ హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దుమ్మెత్తిపోశారు. ప్రజలను రకరకాల వాగ్దానాలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఈ బడ్జెట్ ప్రతిపాదనలే రుజువు చేస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘పదేండ్లు అధికారంలో ఉన్నారు, ఎం చేసిన్రు? ఏం ఇచ్చిన్రు? పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనా?’ అని ప్రశ్నించారు.

‘పాండవులు సంపాదించింది అంతా కౌరవవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లు’ తమ ప్రభుత్వ పరిస్థితి ఉందని చమత్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందన్నారు. ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామంటూ వివరించారు. హరీశ్ రావు నీ నియోజక వర్గానికి 50% రైతు రుణమాఫీ కాలేదు అంటున్నారు కదా.. మరి మీ గవర్నమెంట్ లో ఎందుకు చేయలేదు? మీరు అపుడు చేసి ఉంటే ఇపుడు మీరు అంటున్నట్లుగా మాకు ఇబ్బంది ఉండకపోయేది కదా? అంటూ ప్రశ్నించారు. పదేండ్లలో ఏం చేసిన్రో లెక్కలతో సహా చెప్పండి? మీ హయాంలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మీ బాధ అంత అధికారం పోయిందని తప్ప వేరే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము చేస్తున్న కార్యక్రమాల్లో మన్ను పోసి, మీరు గొప్ప అని చెప్పుకోడంకాదన్నారు.

సీట్ మారినంత మాత్రాన చరిత్ర మారుతాదా? పదేండ్లు అంటే చాలా సమయం మీకు లభించదని, మీరెందుకు ఎందుకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు? అంటూ ప్రశ్నించారు. మీ అప్పులకి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు చెల్లించడానికే ఈ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత భీమా పెడితే ఓర్వ లేకపోతున్నారంటూ ప్రభుత్వం పై మట్టి, దుమ్ము పోసుడు రాజకీయం కాదు. ముందు మీరు అధికారంలో ఉన్నపుడు చేసింది చెప్పి, మేము ఏం చేయాలో చెప్పండంటూ మంత్రి సీతక్క ప్రశ్నించారు.