వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్‌..  ఎలా?

వెనెజులాలో 7.5 తీవ్రత భూకంపం రాకముందే లక్షల మంది ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గూగుల్‌ హెచ్చరిక చేరింది. ఈ ‘భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ ఎలా పనిచేస్తుంది? భారత్‌లో మీ ఫోన్‌ కూడా మిమ్మల్ని కాపాడగలదా? పూర్తి వివరాలు.

Reported by: ADHARVA | సైన్స్​ – టెక్నాలజీ | Edited by: విధాత టెక్ డెస్క్ | Jun 26, 2026, 5:51 pm IST
Read Time: 14 mins
వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్‌..   ఎలా? భూకంపానికి ముందే మొబైల్‌కు వచ్చిన ఆండ్రాయిడ్‌ హెచ్చరిక

హైలైట్స్:

  • మొదట 7.2..  తర్వాత కేవలం 39 సెకన్లకే రెండోది 7.5 తీవ్రతతో..
  • గూగుల్‌ భూకంపాన్ని ఊహించలేదు.. సంకేతాలను పసిగట్టింది
  • కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లే ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప గుర్తింపు నెట్‌వర్క్‌
  • భారత్‌లో 2023 నుంచి అందుబాటులో ఈ వ్యవస్థ

కారకస్(వెనెజులా)​: నేల ఇంకా కంపించలేదు. కానీ వెనెజులా అంతటా కోట్ల కొద్దీ ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఒక్కసారిగా మోగడం మొదలయ్యాయి. ‘‘భూకంపం వస్తోంది.. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి’’ అంటూ తెరపై హెచ్చరికలు మెరిశాయి. చేతిలోని ఫోన్‌ ఆగకుండా అలారం మోగించింది. ఆ కొద్ది క్షణాల తర్వాతే భూమి భయంకరంగా కదిలింది. భవనాలు కుప్పకూలాయి. ఫోన్‌ మోగగానే ఇంట్లోంచి పరుగున బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నామని ఎందరో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ నిజంగా ప్రాణాలను కాపాడగలదా అన్న ప్రశ్నను ఈ ఘటన ప్రపంచం ముందుకు తెచ్చింది.

బుధవారం వెనెజులాను రెండు శక్తిమంతమైన భూకంపాలు వరుసగా కుదిపేశాయి. తొలుత 7.2 తీవ్రతతో ఒక భూకంపం, కేవలం 39 సెకన్ల తర్వాత మరింత తీవ్రమైన 7.5 తీవ్రత గల మరో భూకంపం రాజధాని కారకాస్‌ పరిసరాలను తాకాయి. దేశంలో గత వందేళ్లలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా శాస్త్రవేత్తలు దీన్ని పేర్కొంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 235 మంది మృతిచెందగా, దాదాపు 4300 మంది గాయపడ్డారని, 11వేల మంది ఆచూకీ తెలియడం లేదని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ ప్రకటించారు. శిథిలాల కింద ఇంకా ఎందరో చిక్కుకుపోయి ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంత పెద్ద విపత్తు రాకముందే గూగుల్‌ ఎలా హెచ్చరించగలిగింది? భూకంపాన్ని అది ముందే ఊహించిందా? అంటే కాదన్నదే నిపుణుల సమాధానం. భూకంపం ఎప్పుడు వస్తుందో ముందుగా అంచనా వేయడం నేటికీ సాధ్యం కాని విషయమే. గూగుల్‌ చేసింది వేరు. భూకంపం మొదలైన తొలి క్షణంలోనే దాని సంకేతాలను పసిగట్టి, తీవ్రమైన ప్రకంపనలు ప్రజల వద్దకు చేరకముందే హెచ్చరిక పంపింది. ‘‘గూగుల్‌ భూకంపాన్ని ముందే ఊహించలేదు. భూకంపం ప్రారంభమైన తొలి సంకేతాలను గుర్తించి, తీవ్ర ప్రకంపనలు రాకముందే హెచ్చరిక జారీ చేసింది’’ అని హెచ్‌ఆర్‌ అనెక్సీకి చెందిన బాట్స్‌.ఏఐ డైరెక్టర్‌ నిఖర్‌ అరోరా వివరించారు.

మీ ఫోనే ఒక భూకంప మానిని

Venezuela earthquake intensity map showing M7.5 epicentre

వెనెజులా భూకంప కేంద్రం, తీవ్రతను చూపిస్తున్న మ్యాప్‌

గూగుల్‌ వాడిన టెక్నాలజీ పేరు ‘ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ సిస్టమ్‌’. దీని వెనకున్న రహస్యం మీ చేతిలోని స్మార్ట్‌ఫోనే. ప్రతి ఆధునిక ఫోన్‌లోనూ ‘యాక్సిలరోమీటర్‌’ అనే చిన్న సెన్సర్‌ ఉంటుంది. ఫోన్‌ను అడ్డంగా తిప్పగానే తెర తిరగడానికి సాయపడేది ఇదే. అయితే నేల కంపనలను గుర్తించే శక్తి కూడా దీనికి ఉంది. ఏదైనా ఫోన్‌ భూకంపం తరహా ప్రకంపనలను గుర్తిస్తే, ఆ సంకేతాన్ని, తన అంచనా స్థానాన్ని గూగుల్‌ సర్వర్‌కు పంపిస్తుంది.

ఒక్క ఫోన్‌తో భూకంపమని నిర్ధారించడం కష్టం. అందుకే ఒకే ప్రాంతంలో అనేక ఫోన్లు ఒకేసారి ఇలాంటి ప్రకంపనలను గుర్తిస్తేనే గూగుల్‌ సర్వర్లు భూకంపం వస్తోందని నిర్ధారిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉండటంతో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప గుర్తింపు వ్యవస్థగా నిలిచింది.

మరి భూకంపం తాకకముందే హెచ్చరిక ఎలా చేరుతుంది? భూకంపం ఒకేసారి వచ్చే ఒక కుదుపు కాదు. అది అలల రూపంలో వ్యాపిస్తుంది. తొలుత వచ్చే ప్రైమరీ తరంగాలు (పీ-వేవ్స్‌) సెకనుకు దాదాపు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి బలహీనమైనవి. ఆ తర్వాత వచ్చే సెకండరీ తరంగాలు (ఎస్‌-వేవ్స్‌) సెకనుకు 3-4 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా వచ్చినా, విధ్వంసం సృష్టించేవి ఇవే. ఫోన్‌ తొలి పీ-తరంగాలను పసిగట్టి సర్వర్‌కు సంకేతం పంపుతుంది. ఈ సంకేతం దాదాపు కాంతి వేగంతో (సెకనుకు దాదాపు 2,99,792 కి.మీ.) ప్రయాణిస్తుంది. విధ్వంసకర తరంగాల కంటే ఇది ఎన్నో రెట్లు వేగంగా చేరడంతో, మనకు ముందుగానే హెచ్చరిక అందుతుంది. ‘‘భూకంప వేగానికీ, కాంతి వేగానికీ మధ్య మేం పందెం వేస్తున్నాం. అదృష్టవశాత్తు కాంతి వేగమే ఎంతో ఎక్కువ’’ అని గూగుల్‌ వివరించింది.

సెకన్లే.. కానీ ప్రాణం నిలిపేవి

Rescue workers and residents at Venezuela earthquake rubble site

రాత్రి వేళ భూకంప శిథిలాల వద్ద కొనసాగిన సహాయక చర్యలు

Injured man rescued after Venezuela earthquake

భూకంప శిథిలాల మధ్య గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న స్థానికులు

Hotel building damaged after Venezuela earthquake

వెనెజులాలో భూకంపంతో దెబ్బతిన్న హోటల్‌ భవనం

Woman walking through rubble after Venezuela earthquake

భూకంపం తర్వాత శిథిలాల మధ్య నడుస్తున్న మహిళ

People searching through rubble after Venezuela earthquake

భూకంపం తర్వాత శిథిలాల్లో గాలిస్తున్న స్థానికులు

ఈ హెచ్చరిక కేవలం కొన్ని సెకన్ల ముందుగానే రావచ్చు. కొన్ని సందర్భాల్లో పదుల సెకన్ల వరకు సమయం దొరకవచ్చు. భూకంప కేంద్రానికి మనం ఎంత దూరంలో ఉన్నామన్నదానిపై ఈ సమయం ఆధారపడి ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు చిన్నవిగా అనిపించినా, ఆపత్కాలంలో అవే ఎంతో విలువైనవి. కిటికీల దగ్గర ఉన్నవారు దూరంగా జరగవచ్చు. లిఫ్ట్‌ ఎక్కబోతున్నవారు ఆగవచ్చు. ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేస్తున్నవారు వాటిని ఆపవచ్చు. అంటే గూగుల్‌ హెచ్చరిక ప్రాణాలను నేరుగా కాపాడుతుందనడం కంటే, ప్రాణాలు కాపాడుకునే నిర్ణయం తీసుకునేందుకు కీలకమైన సమయాన్ని ఇస్తుందనడమే సరైనది.

ఆండ్రాయిడ్‌ రెండు రకాల హెచ్చరికలను పంపుతుంది. తేలికపాటి ప్రకంపనల కోసం ‘బీ అవేర్‌’ హెచ్చరిక వస్తుంది. మధ్యస్థం నుంచి తీవ్ర ప్రకంపనల కోసం ‘టేక్‌ యాక్షన్‌’ హెచ్చరిక వస్తుంది. ఇది ఫోన్‌ తెరను ఆక్రమించి, పెద్ద శబ్దంతో వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా ఈ హెచ్చరిక వినిపించేలా రూపొందించారు. హెచ్చరికను తాకగానే భూకంప స్థానం, తీవ్రత చూపే మ్యాప్‌తో పాటు, రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ తెరపై కనిపిస్తాయి. వెనెజులాలో ఒక వినియోగదారుడికి అందిన హెచ్చరికలో, తనకు 341 కిలోమీటర్ల దూరంలో 6.2 తీవ్రత గల భూకంపం గుర్తించినట్లు చూపింది.

అయితే ఫోన్‌ చేతిలో ఉంటే సరిపోదు. హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియడం మరింత ముఖ్యం. భూకంప సమయంలో పరుగులు తీయడం, లిఫ్ట్‌ వాడటం, కిటికీల దగ్గర నిలబడటం ప్రమాదకరం. బదులుగా ‘డ్రాప్‌, కవర్‌, హోల్డ్‌ ఆన్‌’ సూత్రాన్ని పాటించాలి. అంటే కిందకు వంగి, బలమైన ఫర్నిచర్‌ కింద ఆశ్రయం తీసుకుని, ప్రకంపనలు తగ్గే వరకు అక్కడే ఉండాలి. బయట ఉంటే భవనాలు, విద్యుత్‌ స్తంభాలు, గోడల నుంచి దూరంగా జరగాలి.

భారత్‌లోనూ హెచ్చరిక వ్యవస్థ

Global map showing Android Earthquake Alerts detections and warning coverage

ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ గుర్తింపులు, హెచ్చరికల కవరేజ్‌

గూగుల్‌ ‘ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ సిస్టమ్‌’ భారత్‌లో 2023 నుంచి అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 5 అంతకన్నా పైబడిన వెర్షన్‌ ఉన్న ఫోన్లలో ఇది పనిచేస్తుంది. అయితే హెచ్చరికలు అందాలంటే ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌, లొకేషన్‌ సెట్టింగ్స్‌, ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ ఎనేబుల్‌ అయి ఉండాలి. ఈ సేవను ఆన్‌ చేయాలంటే ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Earthquake Alerts’ అని వెతికి ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయాలి. కొన్ని ఫోన్లలో ఇది ‘సేఫ్టీ అండ్‌ ఎమర్జెన్సీ’ విభాగంలో కనిపిస్తుంది.

భారత్‌లో హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, దిల్లీ పరిసరాలు, గుజరాత్‌, అండమాన్‌ వంటి ప్రాంతాలు భూకంప ప్రభావానికి సున్నితమైన జోన్లుగా పరిగణిస్తారు. అందువల్ల ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. 2021లో ప్రారంభమైన ఈ వ్యవస్థ ఇప్పటికే దాదాపు వంద దేశాలకు విస్తరించింది. 18 వేలకు పైగా భూకంపాలను గుర్తించి, 2 వేలకు పైగా పెద్ద ఘటనలపై హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 79 కోట్ల హెచ్చరికలను పంపింది. ఖరీదైన సంప్రదాయ భూకంప పర్యవేక్షణ కేంద్రాలు లేని దేశాలకు ఈ సాంకేతికత ఒక వరంగా మారింది.

టెక్నాలజీకీ పరిమితులు ఉన్నాయి

Venezuela earthquake damaged government building before and after

భూకంపం ముందు, తర్వాత దెబ్బతిన్న ప్రభుత్వ భవనం

Building collapse before and after Venezuela earthquake

భూకంపం ముందు నిలిచిన భవనం.. తర్వాత శిథిలాల దిబ్బగా మారిన దృశ్యం

గూగుల్‌ వ్యవస్థ ఎంత ఉపయోగకరమైనదైనా అది పరిపూర్ణం కాదు. భూకంప కేంద్రానికి చాలా దగ్గరగా ఉన్నవారికి హెచ్చరిక అందడానికి సరిపడా సమయం దొరకకపోవచ్చు. ఇంటర్నెట్‌ లేకపోతే అలర్ట్‌ చేరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రత అంచనాల్లో పొరపాట్లూ జరగవచ్చు. అందుకే ఇలాంటి వ్యవస్థలను అధికారిక విపత్తు నిర్వహణ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, అదనపు రక్షణ పొరగా చూడాలి. ప్రభుత్వ సీస్మిక్‌ నెట్‌వర్క్‌లు, అత్యవసర సేవలు, ప్రజల్లో అవగాహన, పటిష్ఠమైన భవన నిర్మాణ నిబంధనలు అన్నీ కలిసినప్పుడే విపత్తు నష్టాన్ని తగ్గించగలం.

భూకంపాన్ని ఆపలేం. అది ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పనూ లేం. కానీ అది మొదలైన వెంటనే ప్రజలను హెచ్చరించగలిగితే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వెనెజులా ఘటన నేర్పిన అసలు పాఠం ఇదే. సాంకేతికత ప్రకృతిని జయించలేకపోయినా, విలయానికి ముందు మనిషికి కొంత విలువైన సమయాన్నిఇవ్వగలదు. కొన్నిసార్లు ఆ సెకన్ల సమయమే జీవన్మరణాల మధ్య తేడాగా మారవచ్చు.