హైలైట్స్:
- జిల్లా మంత్రులు లేకుండానే ఇతర మంత్రుల పర్యటన
- మొన్న పొంగులేటి , ఉత్తమ్, నేడు భట్టి విక్రమార్క
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పునరావృతం
- పలు ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
- జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ గైర్హాజర్
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు లేకుండానే ఈ జిల్లాలో ఇతర శాఖల మంత్రులు పర్యటించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర మంత్రుల మధ్య ఉన్న ‘విశాలత్వం’తో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ మహిళలే కదా అనే ‘చిన్న చూపు’తో వ్యవహరిస్తున్నారా? లేకపోతే మంత్రుల మధ్య కనీస అవగాహన లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నారా? అనుకోకుండా ఏదైనా సమస్యలు ఏర్పడుతున్నాయా? అనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ పాల్గొనకుండా ఉమ్మడి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. దీంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ ఇద్దరు మంత్రులు తప్ప ఇతర ఎమ్మెల్యేలూ, ముఖ్యప్రజాప్రతినిధులంతా పాల్గొనడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వడ్లకొనుగోలు ఇతరత్రా సమస్యల పై సమీక్షా సమావేశం నిర్వహిస్తే మంత్రులు సీతక్క, సురేఖ హాజరుకాలేదు. సురేఖ జిల్లాలో అందుబాటులో లేనందున పాల్గొనలేదు. సీతక్క తన నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ నెల 2వ తేదీన మరోసారి ఇంచార్జ్ మంత్రిగా ఈ సారి వరంగల్ జిల్లాకు బదులు, హనుమకొండ జిల్లాలో పొంగులేటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతానికి భిన్నంగా ఈ సారి వరంగల్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కొండా సురేఖ ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు.
తాజాగా మంగళవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూడా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సురేఖ, సీతక్క హాజరుకాలేదు. సీతక్క హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మహిళా కార్యక్రమంలో పాల్గొనగా, కొండా సురేఖ ఎందుకు హాజరుకాలేకపోయారనే చర్చ కాంగ్రెస్‌లో సాగుతోంది. మంత్రుల కార్యక్రమాల మధ్య సమన్వయం లేకనా? లేక ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తాజాగా భట్టి విక్రమార్క పాల్గొన్న కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ కుస్రూ పాషా, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి, పాలకుర్తి, నర్సంపేట శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవ రెడ్డి, మామిడాల యశస్వినీ రెడ్డి, కుడా చైర్మన్, డిసిసి అధ్యక్షులు, హనుమకొండ జిల్లా ఇనుగాల వెంకట్రాం రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు, జనగామ జిల్లా లకావత్ ధన్వంతి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్, హనుమకొండ చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రులు మాత్రం హాజరుకాకపోవడం గమనార్హం.