వరంగల్ కాంగ్రెస్ నేతలు కలహాలు వీడారా? కొండాతో విభేదాలు తొలిగినట్టేనా?
మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న వరంగల్ కాంగ్రెస్‌లోని వైరి వర్గాలు ఆత్మీయ సమావేశం పేరిట ముచ్చట్లాడుకుని.. కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు కలిశారా? అధిష్ఠానం వార్నింగ్‌తో సమావేశమయ్యారా? లేక ఇలానే తిట్టుకుంటూ అభివృద్ధిని విస్మరిస్తే జనం ఓడిస్తారని భయపడ్డారా? కారణం ఏదైనా.. పార్టీ కింది స్థాయి క్యాడర్‌లో మాత్రం ఈ పరిణామం సానుకూలతను కలిగిస్తున్నది.
- ఉమ్మడి జిల్లా నేతల ఆత్మీయ కలయిక
- వరంగల్ పార్లమెంట్‌కే పరిమితమా?
- సమావేశానికి మంత్రి సీతక్క దూరం
- క్రమశిక్షణ కమిటీకి పాలకుర్తి లొల్లి
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
వరంగల్ కాంగ్రెస్ నేతల్లో తాజాగా ‘కొత్తదనం’ ఉట్టిపడుతోంది. కొద్ది రోజుల క్రితం నిత్య కలహాలు, గ్రూపు తగదాలు, బహిరంగ తిట్లపురాణాలు, పరస్పర ఆరోపణలతో రక్తి కట్టించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఇప్పుడు ‘అన్నీ’ మరిచిపోయి.. ఉన్నట్టుండి ఐక్యతాగారాన్ని ఆలపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విభేదాలున్న నాయకులంతా ఆత్మీయ కలయిక పేరుతో కలిసి భోజనం చేసుకుని, కులాసా కబుర్లతోపాటు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ కార్యక్రమంపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ముఖ్యలంతా హాజరుకావడంతో కాంగ్రెస్ జిల్లా నేతల్లో వచ్చిన కొత్త మార్పా? లేకుంటే అధిష్ఠానం నుంచి వచ్చిన అల్టిమేటమ్ ఫలితమా? అనే చర్చసాగుతోంది.
కొండా దంపతులతో విభేదాలు
మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులతో వరంగల్‌కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, బస్వరాజు సారయ్యలను కొండా మురళి బహిరంగంగా తిట్టిపోశారు. దీంతో అప్పటి వరకు ఉన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నాయకులు రచ్చకెక్కి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ విభేదాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు, రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణలకు సైతం హాజరై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మొన్నటి రైతు మేళా వరకు సురేఖ తూర్పు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. విభేదాలతో దూరంగా ఉన్న ఈ నేతలు ఆత్మీయ సమావేశం పేరుతో ‘ఒక్కటి’ కావడం ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
హనుమకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ కలయిక
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. కలిసి భోజనం చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ నాయకుడు వరద రాజేశ్వర్ రావు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, అయూబ్, కరుణాకర్, ధనవంతి, మాజీ మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్
నిత్యం గ్రూపులు, విభేదాలతో కలహాల కాపురంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం పేరుతో నాయిని క్యాంప్ కార్యాలయంలో సమావేశం కావడం రాజకీయ వర్గాలతో పాటు, కాంగ్రెస్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఎవరో సీనియర్ నాయకులు చొరవ తీసుకుని ఈ సమావేశానికి నాయిని క్యాంప్ ఆఫీస్‌ను ఎంపిక చేసినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఈ ఆత్మీయ కలయిక ఎంత కాలం ఉంటుందనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, పార్టీ శ్రేణుల్లో మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది. నేతల విభేదాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది కింది స్థాయి క్యాడర్ కావడంతో వారిలో తాజా పరిణామంపై సానుకూలత వ్యక్తమవుతోంది.
అసలుకే ఎసరొస్తుందని గుర్తించారా?
ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఇతర నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? లేక.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అనైక్యత వల్ల అందరం నష్టపోతామని గుర్తించారా? అనే అనే చర్చ సాగుతున్నది. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన కేసీఆర్‌ను పదేండ్లకే ప్రజలు గద్దె దింపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ను ఈ దఫా గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తికావస్తున్నాయి. మరో వైపు ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ క్రమంగా పుంజుకుంటూ తమ రాజకీయ దాడిని తీవ్రం చేశాయి. ఈ సమయంలో ఇంకా విభేదాల్లో కొట్టుమిట్టాడుతూ నియోజకవర్గాలు, జిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోతే ప్రజలు శంకరగిరి మాన్యాలకు పంపిస్తారని గుర్తించే నాయకులు ఒక్క తాటిపైకి వచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యత ప్రదర్శిస్తూ… ప్రత్యర్థి పార్టీల రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుంటే పుట్టిమునుగుతుందని గుర్తించడం కూడా ఒక కారణమై ఉంటుందని అంటున్నారు.
వరంగల్ లోక్‌సభకే పరిమితమా?
ఈ సమావేశానికి హాజరైన నేతలంతా వరంగల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కావడం గమనార్హం. ఈ నాయకుల మధ్యనే విభేదాలున్నందున వాటిని పరిష్కరించుకునేందుకు కలిశారా? అనే చర్చ కూడా వినిపిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల సమావేశంగా చెబుతున్నా.. జిల్లాకు చెందిన మరో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాద్ ఎంపీ బలరాంనాయక్, నర్సంపేట, డోర్నకల్, మహబూబాద్ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రాంచందర్ నాయక్, మురళీ నాయక్ హాజరుకాలేదు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య సైతం కనిపించలేదు. వీరంతా తమ కెందుకీ గొడవలని దూరంగా ఉన్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాలకుర్తిలో మళ్ళీ పంచాయతీ
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించుకుని భవిష్యత్ కర్తవ్యాలు నిర్ణయించుకున్నామని ప్రకటించగా, పాలకుర్తి నియోజకవర్గంలో మళ్లీ కుంపటి రాజుకున్నది. ముఖ్యంగా ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని ఒక వర్గం పీసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై మంగళవారం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారించింది. ఒక చోట విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తుండగా మరోచోట విభేదాలు భగ్గుమంటుండటంతో పార్టీ నాయకత్వం తల పట్టుకుంటున్నది. జనగామ నియోజకవర్గ పరిధిలో కూడా కొత్త డీసీసీ అధ్యక్షురాలికి, పాత డీసీసీ అధ్యక్షునికి పొసగడంలేదంటున్నారు.
Read Also |
మోదీ ఎందుకు మీడియాను ఎదుర్కొనడం లేదు.. అసలు సంగతి వదిలి.. చరిత్ర చెప్పిన విదేశాంగ కార్యదర్శి
అక్కడ అంత్యక్రియల నిర్వహణ నరకమే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram