మోదీ ఎందుకు మీడియాను ఎదుర్కొనడం లేదు.. అసలు సంగతి వదిలి.. చరిత్ర చెప్పిన విదేశాంగ కార్యదర్శి
మోదీ మీడియా సమావేశాల్లో పాల్గొనకపోవడం అందునా విదేశీ గడ్డపై నోరు మెదపకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. నార్వేలో సంయుక్త మీడియా సమావేశంలో మోదీని అక్కడి జర్నలిస్టు ప్రశ్నించడం, మోదీని ప్రశ్నిస్తుంటే.. ఆయన మౌనంగా వెళ్లిపోతున్న వీడియోను పోస్ట్ చేయడం.. విదేశాంగ శాఖను ఇరకాటంలో పడేసింది.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మీడియా సమావేశాలకు హాజరుకాని అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ బహిరంగ మీడియా సమావేశాలను మోదీ ఎదుర్కొనలేదు. కేవలం ఎంపిక చేసిన కొద్దిమందితోనే, సిద్ధం చేసిన ప్రశ్నావళి ఆధారంగానే మాట్లాడుతూ వచ్చారు. విదేశాల్లో అయితే అది కూడా లేదు. తాజాగా ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన మోదీ.. నెదర్లాండ్స్, నార్వేలో సంయుక్త మీడియా సమావేశాల్లో పాల్గొనలేదు. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛలో నార్వే అగ్రస్థానాల్లో ఉంటుంది. అక్కడ పత్రికలకు, మీడియాకు అపారమైన స్వేచ్ఛ ఉన్నది. అలాంటి నార్వేలో సైతం మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధపడకపోవడం ఒక ఎత్తయితే.. దానిని భారత విదేశాంగ శాఖ సమర్థించుకోవడం మరో మరో ఎత్తుగా నిలిచింది.
ప్రశ్నించిన నార్వే జర్నలిస్టు
ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్ పర్యటనలను ముగించుకుని నార్వే పర్యటనకు వచ్చారు. ఆ దేశాధినేత జొనాస్ గర్ స్టోర్‌తో సోమవారం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఇతర దేశాధినేతలు వస్తే ఇక్కడి మీడియాతో మాట్లాడటం సంప్రదాయంగా వస్తున్నది. ఈ సందర్భంగా మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే వెళ్లిపోతుండటాన్ని హెల్లీ లింగ్ అనే నార్వే మీడియా ప్రతినిధి ఒకరు అడ్డుకున్నారు. మీడియా ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా ఆమె తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. దానికి.. ‘భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నేను ఆయన నుంచి అది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు.’ అని క్యాప్షన్ పెట్టారు. ‘ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎందుకు ఎదుర్కొనలేకపోతున్నారు?’ అని ఒక మహిళ ప్రశ్నించడం ఆ వీడియోలో వినిపిస్తున్నది. దానిని మోదీ పట్టిచుకోకుండానే వేదిక నుంచి నిష్క్రమించారు.
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate… pic.twitter.com/vZHYZnAvev
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
‘పత్రికా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉన్నది. భారత్ 157వ స్థానంలో ఉంటూ పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాలతో పోటీ పడుతున్నది. మనం సహకరించే నాయకులను ప్రశ్నించడం మన బాధ్యత’ అని ఆ పోస్టులో రాశారు. ఈ పోస్టు తీవ్ర సంచలనం రేపింది. మోదీ విదేశీ పర్యటనపై విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చింది. ‘విశ్వాసం’, ‘మానవ హక్కుల’పై అధికారులు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. మోదీ వీడియోను పోస్ట్ చేసిన నార్వే జర్నలిస్టు.. ఇక్కడ కూడా భారత అధికారులను నిలదీశారు. ‘మేం మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి? మీ దేశంలో సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఆపివేస్తామని మీరు హామీ ఇవ్వగలరా?’ అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. భారత మీడియా నుంచి క్లి్ష్టమైన ప్రశ్నలను ఎదుర్కొనడాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారా?’ అని కూడా ప్రశ్నించారు.
అసలు భారతదేశం అంటే…
నార్వే జర్నలిస్టు ప్రశ్నలకు జవాబిచ్చిన విదేశాంగ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్.. అసలు విషయాన్ని పక్కనపెట్టి.. చరిత్ర బోధించేందుకు పూనుకున్నారు. ‘భారతదేశం అంటే ఏమిటి? అసలు ఒక దేశం అంటే ఏమిటి? నేపథ్యం నేను చెబుతాను. ఈ రోజు ఒక దేశానికి నాలుగు ప్రధాన అంశాలు. ఒకటి జనాభా, రెండు ప్రభుత్వం, మూడోది సార్వభౌమత్వం, నాలుగోది భౌగోళికం. అవన్నీ ఉంటేనే ఒక దేశం అవుతుంది. మేం గర్వంగా చెప్పకోగలం.. మాది 5వేల ఏళ్లనాటి నాగరికతను కలిగిన దేశం. ఆ నాగరికత ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచానికి ఇతోధికంగా సేవలు అందించింది’ అని జార్జ్ వివరించారు. ఈలోపు ఒక పాత్రికేయుడు జోక్యం చేసుకుని, అసలు విషయానికి రావాలని సూచించడంతో.. కోపానికి వచ్చిన జార్జ్.. ‘నన్ను మధ్యలో అడ్డుకోకండి’ అంటూ కఠినంగా చెప్పారు.
‘ఒక దేశం భారత్‌ను ఎందుకు విశ్వసించాలని మీరు అడిగారు. దానిని నన్ను సమాధానం చెప్పనీయండి.. ‘నాగరీక భారత దేశం ప్రపంచానికి ఎన్నో విశిష్ట సేవలు అందించింది. యావత్ ప్రపంచం కొవిడ్‌తో బాధపడినప్పుడు మీరేం చేశారు? మేం గుహల్లోకి వెళ్లి తలదాచుకోలేదు. మేం ప్రపంచాన్ని కాపాడలేమని మేం చెప్పలేదు. ప్రపంచానికి చేయూతనందించాం’ అని చెప్పారు. అదే సమయంలో జీ20, ఏఐ సమ్మిట్ వంటి చోట్ల కీలక అంశాలు లేవనెత్తిన సంగతులను ఏకరువు పెట్టబోయారు. దీంతో మరో జర్నలిస్టు జోక్యం చేసుకుంటూ సమాధానాలు సూటిగా చెప్పాలని కోరగా.. తనను చెప్పనివ్వాలని అన్నారు. మీరు సమాధానాలు మీకు నచ్చిన విధంగా చెప్పాలనుకోవద్దని ఆగ్రహించారు. ఇప్పటి సంగతులు మాట్లాడకుండా.. గత చరిత్రను చెప్పేందుకు మళ్లీ ప్రయత్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే మహిళలకు సమాన హక్కులు, ఓటు వేసే హక్కు అమలు చేశామని తెలిపారు. తాము సమానత్వాన్ని, మానవ హక్కులను గుర్తిస్తామన్న జార్జ్.. ఎవరైనా తమ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని భావిస్తే కోర్టుకు పోవచ్చని సలహా ఇచ్చారు. విస్మరించతగిన స్వచ్ఛంద సంస్థల నివేదికలు చదివి స్టేట్‌మెంట్స్ ఇవ్వొద్దని అన్నారు. ప్రధాని ఎందుకు మీడియా ప్రశ్నలను ఎదుర్కొనడం లేదని మరో జర్నలిస్టు ప్రశ్నించగా.. ఈ పర్యటన ఇన్‌చార్జ్ తానేనని, మీడియాతో మాట్లాడటం తన బాధ్యతేనని చెప్పారు. దీనిని తాను కొనసాగిస్తానని తెలిపారు తప్ప.. మోదీ ఎందుకు మాట్లాడటం లేదన్న విషయాన్ని మాత్రం దాటవేశారు.
#WATCH | Oslo, Norway | MEA Secretary (West) Sibi George responds to question by reporters from Norway – “Why should we trust you?” ” Will the PM take critical questions from the Indian Press?” pic.twitter.com/iaEGIlVG08
— ANI (@ANI) May 18, 2026
Read Also |
Paytm Pocket Money | బ్యాంక్ ఖాతా లేకుండానే యూపీఐ సేవలు.. టీనేజర్ల కోసం పేటీఎం సరికొత్త ఫీచర్!
Smartphone Price Hike | కొత్తగా ఫోన్ కొనేవారికి షాక్.. స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెంచిన రియల్‌మీ.. వన్‌ప్లస్, లావా కూడా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram