• Telugu News
  • /Telangana

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో జంగల్ సఫారీ నిలిపివేత

నల్లమల అడవులు కేద్రంగా దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్టుగా గుర్తింపు పొందిన అమ్రాబాద్‌ అభయారణ్యంలో జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు జంగల్ సఫారీని నిలిపివేస్తున్నట్లు డీఎఫ్ఓ రేవంత్ చంద్ర ప్రకటించారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం కారణంగా జంగల్ సఫారీ నిలిపివేసినట్లుగా వెల్లడించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ లో తాజా గణనలో 42పులులు ఉన్నట్లుగా తేలింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 28, 2026, 4:32 pm IST
Read Time: 11 mins
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో జంగల్ సఫారీ నిలిపివేత

విధాత : నల్లమల అడవులు కేద్రంగా దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఫారెస్టుగా గుర్తింపు పొందిన అమ్రాబాద్‌ అభయారణ్యంలో జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు జంగల్ సఫారీని నిలిపివేస్తున్నట్లు డీఎఫ్ఓ రేవంత్ చంద్ర ప్రకటించారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం కారణంగా జంగల్ సఫారీ నిలిపివేసినట్లుగా వెల్లడించారు. ఈ కాలంలో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై వాహనాలు గంటకు 30 కిలోమీటర్ల వేగం మించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ లో 42పులులు

తూర్పు కనుమలలో భాగమైన నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఐదు జిల్లాల (కర్నూలు, ప్రకాశం, మహబూబ్ నగర్, నల్గొండ, కడప) గుండా విస్తరించి ఉన్నాయి. అద్భుతమైన జీవవైవిధ్యానికి, పులుల సంరక్షణకు (నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్), సుందరమైన జలపాతాలు, పురాతన ఆలయాలకు ప్రసిద్ది గాంచాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నుంచి జిల్లాలోని కొల్లాపూర్‌ వరకు 2,611 చదరపు కిలో మీటర్ల మేర అడవులలో విస్తరించి ఉన్న అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం (ఏటీఆర్‌)లో అఖిల భారత పులుల సంఖ్య అంచనా- 2026 సర్వే ప్రకారం అమ్రాబాద్‌ అడవుల్లో మొత్తం 42 పెద్దపులులు నివాసం ఉంటున్నట్లు తేలిందని డీఎఫ్ఓ రేవంత్‌ చంద్ర వెల్లడించారు. ఈ అభయారణ్యంలో 18 ఆడ, 14 మగ, 2 ఉప వయోజన పులులతో పాటు 8 పులి పిల్లలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. 2024 సర్వే ప్రకారం అమ్రాబాద్‌ అభయారణ్యంలో 36 పెద్దపులులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 42కు పెరగడంతో నల్లమలలో అటవీ అధికారులు చేపడుతున్న పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది.

పిల్లలు, ఉప-వయోజన పులులు ఉండటం అనేది విజయవంతమైన సంతానోత్పత్తికి, రిజర్వ్‌లో ఆరోగ్యకరమైన, సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన పులుల సమూహం ఉందనడానికి సంకేతంగా అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం ఎనిమిది పులి పిల్లలు ఉండటం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల సంఖ్యను 36 నుంచి 42కి పెంచగలిగామని ఏటీఆర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ సునీల్‌ ఎస్‌ హిరేమత్‌ తెలిపారు. రిజర్వ్‌లో మగ పులులకంటే ఆడ పులులే ఎకువగా ఉండటం మంచి పరిణామం అన్నారు.

కొనసాగుతున్న అఖిల భారత పులుల జన గణన

2026 అఖిల భారత పులుల జన గణన కార్యక్రమం దేశవ్యాప్తంగా అడవులు, అభయారణ్యాలు, పులుల కారిడార్లలో జనవరి ఆరంభంలో మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల పర్యవేక్షణ కార్యక్రమమైన భారత పులుల గణన ఇది ఆరవ విడత కావడం గమనార్హం. 2027 నాటికి ఈ సర్వే లెక్కలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 58 టైగర్ రిజర్వ్ జోన్లు (పులి సంరక్షణ కేంద్రాలు) ఉన్నాయి。ఈ రిజర్వ్‌లు దేశంలోని 18 రాష్ట్రాలలో దాదాపు 84,487 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

సర్వే అంశాలు..

పులుల జన గణన ప్రధానంగా కొనసాగుతున్నప్పటికి చిరుతపులులు, అడవి కుక్కలు (ధోల్స్), హైనాలు, ఇతర మాంసాహార జంతువులు లెక్కలు కూడా సేకరిస్తారు. వేటాడే జంతువుల జనాభాను, వాటి పరస్పర ఆధారిత జీవన ప్రక్రియలను అర్థం చేసుకోవడం, ఆహారం కోసం జరిగే పోటీని, ప్రాదేశిక సంఘర్షణలను గుర్తించడంలో ఈ సర్వే ఉపయోగపడనుతంది.

ఎర జంతువుల జన గణన

గౌర్, సాంబార్, మచ్చల జింక, బార్కింగ్ డీర్, అడవి పంది వంటి పెద్ద శాకాహారులు పులుల మనుగడకు కీలక ఆహార వనరుగా ఉన్నాయి. ఆహార జంతువుల సంఖ్య తగ్గితే, పులుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ జనాభా గణన ఆహార జంతువుల జనాభాను లెక్కించి..ఏయే అటవీ ప్రాంతాలు పులుల మనుగడకు అనుకూలంగా ఉన్నాయో అంచనా వేస్తారు. అలాగే సర్వేయర్లు అటవీ విస్తీర్ణం, నీటి లభ్యత, మానవ ఆక్రమణలు, సంరక్షిత ప్రాంతాల మధ్య నెలకొన్న పరిస్థితులను సైతం అంచనా వేస్తారు. పులులు రిజర్వ్‌ ఫారెస్టుల మధ్య సంచరించడానికి వీలు కల్పించే కారిడార్లు జన్యు వైవిధ్యానికి,దీర్ఘకాలికంగా వాటి మనుగడకు అత్యంత కీలకం. పులుల గణన టైగర్ కారిడార్లను మ్యాప్ చేయడంతో పాటు వాటి సంరక్షణ, మనుగడలకు ఎదురవుతున్నన ముప్పులను గుర్తిస్తుంది.

పెరుగుతున్న పులుల జనాభా..

భారత ప్రభుత్వం దేశంలో క్షిణించిపోతున్న పులుల సంరక్షణకు 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించింది. అప్పట్లో భారతదేశంలో సుమారు 1,800 వన్యపులులు ఉండేవని అంచనా వేశారు. 2006 నాటికి ఆ సంఖ్య 1,411కి పడిపోయింది. దీంతో కేంద్రం పులుల సంతతి అభివృద్దికి అత్యవసర సంరక్షణ చర్యలను, కార్యక్రమాలను చేపట్టింది. దీంతో టైగర్ రిజర్వ్ జోన్ ల ఏర్పాటుతో 2010 జనాభా లెక్కల ప్రకారం 1,706 పులులు నమోదయ్యాయి . 2014 నాటికి ఆ సంఖ్య 2,226కు పెరిగింది. 2018 లెక్కల ప్రకారం ఆ సంఖ్య 2,967కి చేరింది. 2022లో సేకరించిన పులుల జనాభా లెక్కల ప్రకారం భారతదేశం అంతటా 3,682 పులులు ఉన్నట్లు గుర్తించారు. కేవలం 16 సంవత్సరాలలోనే ఇది 2006 నాటి జనాభా కంటే రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రపంచంలోని అడవి పులుల జనాభాలో సుమారు 75% ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. అఖిల భారత పులుల అంచనా కేవలం భారతదేశానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పులలు జాతి మనుగడకు కూడా అత్యంత కీలకంగా మారడం విశేషం.

రాష్ట్రాల వారీగా పులుల డేటా

2022పులుల జనాభా గణన ప్రకారం అత్యధికంగా 785 పులులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.ఈ రాష్ట్రంలో అత్యధికంగా 6 టైగర్ రిజర్వ్ జోన్లు ఉన్నాయి. కర్ణాటక 563 పులులతో దాని తర్వాతి స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లో 560 పులులు ఉన్నాయి. మహారాష్ట్రలో 444 పులులు నమోదు కాగా, తమిళనాడులో 2018 నాటి 264 పులుల సంఖ్య 306కు పెరిగి గణనీయమైన వృద్ధిని కనబరిచింది. అస్సాం, కేరళ, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా పులుల సంఖ్య గణనీయంగా ఉంది.

జిమ్ కార్బెట్, బంధవ్‌గఢ్, కాజీరంగా, నాగర్‌హోల్, రణతంబోర్ వంటి కీలకమైన అభయారణ్యాలు ప్రపంచంలోనే అత్యధిక పులుల జన సాంద్రతను కలిగి ఉన్నాయి. ఈ అభయారణ్యాలు పులుల మూల జనాభాగా కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుండి యువ పులులు సమీపంలోని అడవులు, కారిడార్లలో తమ భూభాగాలను స్థాపించుకోవడానికి విస్తరిస్తాస్తున్నాయి. 2026 జనాభా గణనలో తమిళనాడులోని ఐదు పులి సంరక్షణ కేంద్రాలు కలకాడ్ ముండంతురై, అనమలై, ముదుమలై, సత్యమంగళం, శ్రీవిల్లిపుత్తూరు-మేఘమలై జోన్లలో పులుల సర్వే కొనసాగుతుంది. 2026  జాతీయ పులుల జనాభా గణన లెక్కలు 2027లో వెల్లడవుతాయి.

Tags: