సీఎం నల్లగొండ టూర్..ప్రతిపక్ష నేతల అరెస్టు

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎం నాయకులను, విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం నిరసనలకు దారితీసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 28, 2026, 3:58 pm IST
Read Time: 5 mins
సీఎం నల్లగొండ టూర్..ప్రతిపక్ష నేతల అరెస్టు

విధాత : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎం నాయకులను, విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం నిరసనలకు దారితీసింది. ముందస్తు అరెస్టులను, కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యాలను నిరసిస్తూ. బీఆర్ఎస్, సీపీఎం శ్రేణులు, నాయకులు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న ఎన్జీ కళాశాల సభా ప్రాంగణం ముందు ప్లకార్డ్సుతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ప్రజా పాలన కాదు.. నిర్బంధ పాలన

సీఎం పర్యటనకు ముందు సీపీఐ(ఎం) నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన పార్టీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీపీఎం దొడ్డి కొమరయ్య భవన్ నుండి సుభాష్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన సందర్భంగా జిల్లాల్లో ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మేము అధికారంలోకి వస్తే ముందస్తు అరెస్టులు చెయ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ నేడు అదే చేస్తుందని విమర్శించారు. నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు సమయం కోరిన నాయకులను గృహ నిర్బంధం చేయడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ప్రజల గొంతు వినకుండా నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని, ఇది ప్రజా పాలన కాదని, నిర్బంధ పాలనకు నిదర్శనమని విమర్శించారు.

ముందస్తుగా అరెస్టు చేసిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, దండంపల్లి సత్తయ్య, వి మధుసూదన్ రెడ్డి, ఔట రవీందర్ గార్లతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసిన వారిని వెంటనే భేషరతుగా విడుదల చేసి, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల పద్మ, గాధ నరసింహ, భీమగాని గణేష్, బొల్లు రవీంద్ర కుమార్, సల్వాజు సైదాచారి, గౌరీదేవి మధు, గంజి రాజేష్, తెలకపల్లి శ్రీనివాస్, శివ సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.