రాష్ట్రంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు వాటి నియంత్రణ, నివారణకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ర్యాలీని ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నియంత్రణకు అవసరమైన అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. కొత్తగా ఎవరూ హెచ్‌ఐవీ బారిన పడకుండా నివారణ చర్యలపై అవగాహన పెంచడంతో పాటు, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి అవసరమైన వైద్య సేవలు, సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
హెచ్‌ఐవీతో జీవిస్తున్న తల్లుల నుంచి పుట్టబోయే పిల్లలకు వైరస్ సంక్రమించకుండా అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సపై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.
ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములై హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
“Be Positive – Stop HIV Positive” అనే నినాదంతో తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పాటు పలువురు అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, అవగాహన కార్యకర్తలు పాల్గొన్నారు.