• Telugu News
  • /Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అంతర్మథనం..కాంగ్రెస్ లో అలజడి !

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నిధులు, పనులు, అపాయింట్‌మెంట్లపై పోచారం వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 12, 2026, 5:50 pm IST
Read Time: 11 mins
ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అంతర్మథనం..కాంగ్రెస్ లో అలజడి !

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి…కాంగ్రెస్ లోకి మారిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నో ఆశలు..అంచనాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఇముడలేక..ప్రభుత్వం నుంచి ఆశించిన నిధుల మంజూరీకాక, పనులు చేసుకోలేక ఫిరాయింపు ఎమ్మెల్యేల ముద్రతో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయామన్న అంతర్మథనానికి గురవుతున్నారు. ఇందుకు తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూరు ఆత్మీయ సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను…ఫిరాయింపు ఎమ్మెల్యేల అసమ్మతిని బహిర్గతం చేశాయి. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడం, కనీసం ముఖ్యమంత్రి, మంత్రుల అపాయింట్‌మెంట్‌లు కూడా సకాలంలో లభించకపోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది.

అభివృద్ది నినాదంతో హస్తం గూటికి..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ఉన్నారు. వీరిలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ తరఫున బీ-ఫాం తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా తమ నియోజవకర్గాల అభివృద్ది నినాదంతో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని చెప్పుకున్నారు. అయితే వారు జనంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానూ చెప్పుకోలేకపోతున్నారు. దీనికి తోడు పార్టీ మారిన సందర్భంగా సీఎం రేవంత్ నుంచి అందిన హామీలు అమలు కాకపోవడం వారిని అసహానానికి గురి చేస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ సాంకేతికంగా, చట్టబద్ధంగా , అధికారికంగా తమ పార్టీలో విలీనం చేసుకోలేకపోవడం…ఇటు అనర్హత పిటిషన్ల రచ్చతో వారంతా రాజకీయ త్రిశంకు స్వర్గం దుస్థితిని ఎదుర్కోనడం వారిని మరింత ఇరకాటంలో పడేసింది.

మా ఫోన్లు కూడా సీఎం, మంత్రులు ఎత్తని దుస్థితి మాది: పోచారం

పార్టీ మార్పుపై అంశంపై తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. నేను మంత్రి పదవి కోసమో, సొంత పనుల కోసమో పార్టీ మారలేదని, కేవలం బాన్సువాడ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు కావడం లేదు అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా నా ఫోన్లు ఎత్తడం లేదని పోచారం వాపోయారు. బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గంలోని పనులను కాంట్రాక్టర్లు సగంలోనే నిలిపేశారని తెలిపారు.

నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే అభివృద్ది జరిగిందని, అన్నం పెట్టిన వారిని మరిచిపోలేమని, కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేనది, కాని నియోజకవర్గంలో కొంత మంది వ్యవహారశైలి నచ్చక పోవడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ తో కలువాల్సి వచ్చిందని తెలిపారు. అయినా తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, మూడురంగుల జాతీయ జెండాను కప్పుకున్నానని అన్నారు. పోచారం చేసిన ఆరోపణలు ప్రభుత్వంలో ఫిరాయింపుదారులకు దక్కుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ కేడర్ తో కొరవడిన సమన్వయం

బీఆర్ ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం నుంచి సహాయ నిరాకరణ, సమన్వయం లోపం ఎదురవుతుండటంతో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారి వర్గీయులకు ప్రాధాన్యతనివ్వడం కూడా కాంగ్రెస్ కేడర్ లో చిచ్చు రేపుతుంది. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ కు, పటాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవేళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాలలో బండ్ల మోహన్ రెడ్డికి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో రోజు ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. ఇటీవల మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, పాత కాంగ్రెస్ నాయకులకు మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో సాగింది.

మళ్లీ బీఆర్ఎస్ వైపు చూపు…

ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా..తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు నిధులు దక్కకపోవడం, సీఎం సహా మంత్రుల నుంచి ఆశించిన స్పందన లభించకపోతుండటంతో విసుగుచెందిన పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాన్ని తీవ్రంగా వేడెక్కిస్తున్నాయి. కేవలం నంబర్ గేమ్ కోసం చేర్చుకుని..పార్టీలో తగిన గుర్తింపునివ్వకపోతుండటం, నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వారిని అంతర్మథనంలో పడేసింది.

ఎన్నికల్లో తమ నియోజకవర్గాలలో వ్యక్తిగతంగా ఇచ్చిన హామీల అమలు చేయలేక, పార్టీ మారిన సందర్బంగా ఆశించిన నిధుల మంజూరీ చేసుకోలేక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తుంది. దీంతో పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం సైతం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలను బుజ్జగించి వారి కోరికలు తీర్చి కాంగ్రెస్ నుంచి చేజారకుండా చూస్తారా? లేదా ? అన్నది మునుముందు తేలనుంది.