కేటీఆర్ చూడండి.. కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

వాసాలమర్రి గ్రామానికి చెందిన ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు అందిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ ఫోటోను షేర్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 16, 2026, 4:01 pm IST
Read Time: 6 mins
కేటీఆర్ చూడండి.. కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో కేసీఆర్ దోస్తుగా పేరొందిన ఆగవ్వ అనే వృద్దురాలికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వడాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. డ్రామారావు కేటీఆర్..ఇదిగో చూడండి, ఇందిరమ్మ ఇంట్లో ఆనందంగా కేసీఆర్ దోస్తు ఆగవ్వ! అని మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇంటితో కూడిన ఆగవ్వ ఫోటోను పోస్టు చేశారు. వాసాలమర్రి గ్రామంలో కేసీఆర్ అసమర్థ పాలన కారణంగా సొంతింటి కలకు దూరమైన ఆగవ్వతో పాటు అర్హులైన అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం సీఎం రేవంత్ రెడ్డి రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా పొంగులేటి పేర్కొన్నారు.

దత్తత పేరుతో, దావత్ పేరుతో ఆర్భాటపు ప్రచారాలు చేసుకున్న కేసీఆర్… పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే, దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామ ప్రజలను కూడా మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే వాసాలమర్రిలో అనేక ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి, ఇది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అని నిరూపించిందని పొంగులేటి స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో తొలి దశలో 4.5 లక్షలు, రెండో దశలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో కూడా తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నాం అని ఈ సందర్బంగా పొంగులేటి వెల్లడించారు.

ఆగవ్వ ఆనందం…

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కలపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని యాదగిరిగుట్టకు ఎర్రవెల్లి నుంచి రోడ్డు విస్తరణ చేసే క్రమంలో పూర్తిగా నెల మట్టం చేశారు. గ్రామస్తులందరికి మరో చోట కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా 2021జూన్ 22న గ్రామస్తులతో విందు భోజనం చేసి వారికి పక్కా ఇండ్లపై హామీ ఇచ్చారు. ఆ విందులో కేసీఆర్ తన పక్కన ఆగవ్వ అనే వృద్దురాలితో కలిసి భోజనం చేశారు. కేసీఆర్ పక్కా ఇండ్లు కట్టిస్తారని ఎదురుచూసిన వాసాలమర్రి గ్రామస్తులకు కేసీఆర్ ప్రభుత్వంలో నిరాశే మిగిలింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్తులందరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించగా.. ఆగవ్వతో సహా గ్రామస్తులు కొత్త ఇళ్లలోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా ఆగవ్వ స్పందిస్తూ..తన సొంతిల్లు కల నెరవేరిందని, చాల సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తామని చెప్పి చేయకపోయినా..కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఇళ్లు కట్టించడంతో నా సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.