పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ గులాంగిరి పాలన కొనసాగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి 32 నెలల్లో రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి పోయాడని, అక్కడ ఆయన యాచిస్తున్నాడో, ఇస్తున్నాడో తెలీదు కానీ.. గులాంగిరి చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి.. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ లాగా గొంతు విప్పితే సింహంలా గర్జించాలని.. కాంగ్రెస్‌తో కలవొద్దని ఆయన చెప్పేవారు అని, తెలంగాణ వాడు ఉంటేనే పనవుతుందని, ఢిల్లీవాడు చెప్పినట్టు తలాడిస్తే ఏమీ కాదని అనేవారని కేటీఆర్ జయశంకర్ మాటాలను గుర్తు చేశారు. యాచించి కాదు, శాసించి తెలంగాణ తెచ్చుకోవాలని జయశంకర్ సార్ చెప్పేవారని అన్నారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలని జయశంకర్ చెప్పేవారని, ఢిల్లీ చెప్పినట్టు తలాడించేవాడు మనకు వద్దని చెప్పేవారని, పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేక రాష్ట్రం సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.
మనకేమో గురువు జయశంకర్ అయితే సీఎం రేవంత్ కు గురువు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు అని కేటీఆర్ చురకలేశారు. కనీసం జై తెలంగాణ అనడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనసొప్పదని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ నుంచి నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి వస్తున్నడాని, 75 సార్లు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు తెచ్చిందేముంది? అని ప్రశ్నించారు. జయశంకర్ సారు తిరిగివచ్చి ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండన్నారు. అప్పులపై కాంగ్రెస్ నాయకుల తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఆర్బీఐ చెప్పినా వారికి చెవికెక్కడం లేదు అని, ఇలాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే బాగుండేది అని కేటీఆర్ విమర్శించారు. జీవితంలో జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి మేధావా?, కేశవరావు మేధావి అని రేవంత్ అంటున్నాడని, మావొళ్ల పేర్లంటే చెప్పకపోతివి.. నీ పక్కకున్న కోదండరాం పేరు కూడా చెప్పవా? అని కేటీఆర్ సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ 1969, 2001లో కేస్ స్టడీ రాశారని, నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం మనదని, నీళ్లున్నా ముఖ్యమంత్రి పంపులు ఆన్ చెయ్యడం లేదని విమర్శించారు.
ఉద్యోగాల కోసం పిల్లలు కొట్లాడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని, మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టారని, ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాలు ఎందుకిస్తలేరో రేవంత్, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్ అని, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అని జయశంకర్ చెప్పేవారన్నారు. మూడు తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని పదేపదే చెప్పేవారని, జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టాలని, అదే మనం జయశంకర్ సారుకు ఇచ్చే నిజమైన నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.