ఇంకా వీడని…తుని చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ మిస్టరీ!

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై 11 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jun 16, 2026, 2:27 pm IST
Read Time: 5 mins
ఇంకా వీడని…తుని చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ మిస్టరీ!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసు రోజురోజుకీ మిస్టరీగా మారుతోంది. పామాయిల్ తోటలో తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 11 రోజులుగా వందలాది మంది పోలీసులు గాలిస్తున్నా.. చిన్నారి ఆచూకీపై ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎవరైనా చిన్నారిని కిడ్నాప్ చేశారా? లేక అటవీ ప్రాంతంలో క్రూర జంతువు దాడి చేసి చంపిందా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాన్ని అటవీ, పోలీసు, ఎన్డీఆర్​ఎఫ్, ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ జంతువులు తిరుగుతున్న ఆనవాళ్లు కూడా లేవు.

చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లిన పెంపుడు కుక్క బాలిక ఆచూకీ అందిస్తుందని పెట్టుకున్న ఆశలు కాస్తా…కుక్క అనుమానస్పదంగా అకస్మాత్తుగా మరణించడంతో అవిరైపోయాయి. దీంతో ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు సీసీ కెమెరాలు,థర్మల్ కెమెరాలతో, ఫోన్​ కాల్స్, ఇతర సాంకేతికత ద్వారా చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు సవాల్​ గా మారిన ఈ ఘటన మిస్టరీ చేధించేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

చిన్నారిపై కొండచిలువ లేదా ఇతర అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తుండగా, అటవీ శాఖ అధికారులు మాత్రం అలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, ఇతర వన్యప్రాణులు దాడి చేసిన ఘటనలు నమోదైన దాఖలాలు లేవని అటవీ శాఖ అధికారి పట్టాభి స్పష్టం చేశారు. పాప ఆచూకీ కోసం రాత్రి వేళల్లో ఏమైనా అడవి జంతువుల సంచారం ఉందా అన్న కోణంతో అటవీ శాఖ అధికారులు అక్కడ నైట్ కెమెరాలను కూడా ప్రొఫెషనల్ గా ఇన్స్టాల్ చేసినట్లుగా వెల్లడించారు.

ఈ కేసును అన్ని కోణాల్లో విస్తృతస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. కానీ ఇంతవరకు ఏ క్లూ దొరకలేదని.. సాంకేతిక ఆధారాలు కూడా లభ్యం కాలేదని పేర్కొన్నారు. అయితే అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి అదృశ్యమైన పరిస్థితిని చూస్తే.. ముందస్తు ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేశారని అనుకోలేమని తెలిపారు. పాప తనకు తానే నడిచి వెళ్లిందని.. కేవలం 30 నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. హఠాత్తుగా ఏం జరిగిందన్నదానిపైనే స్పష్టం రావాల్సి ఉందన్నారు. అడవిలో పాప కనిపిస్తే ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని.. ఇంకా దీనిపై స్పష్టత రాలేదని అన్నారు. పాప కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు.