తల్లో తండ్రో తమ పిల్లలను ‘ఒకసారి ఇలా రా’ అని పిలుస్తారు. ‘వస్తున్నా.. రెండు నిమిషాలు..’ అని సమాధానం వస్తుంది. మళ్లీ అడిగితే.. ‘ఇదిగో వచ్చేస్తున్నా..’ అంటూ మళ్లీ అదే సమాధానం. రెండు నిమిషాలు కాదు.. 20 నిమిషాలైనా రారు. ఇంతకీ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్ స్క్రోలింగ్! పిల్లలే కాదు.. యువత, పెద్దవాళ్లు సైతం మొబైల్ ఫోన్‌ను లేదా ఫోన్‌లోని సోషల్ మీడియా యాప్స్‌ను స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఓ పది నిమిషాలు అనుకుంటాం. కానీ.. ఇరవై నిమిషాలు.. అది కాస్తా.. 30 నిమిషాలు అయిపోతుంది. అలా చూస్తూ చూస్తూనే ఒక్కోసారి గంటలు గడిచిపోతాయి. పిల్లుల వింత చేష్టల వీడియోలు కావచ్చు.. పిల్లల అమాయక నవ్వులు నిండిన పోస్టులు కావచ్చు.. ఫన్నీ మీమ్స్ కావచ్చు.. లేదా వార్తలు కూడా కావచ్చు. ఇలాంటి కంటెంట్‌ను గంటల తరబడి స్క్రోల్ చేయడం అనేది చాలా మందికి ఒక దినచర్యగా మారిపోయింది. కొందరైతే ఇలా స్క్రోల్ చేసే సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. ఇది మితిమీరుతున్నదని, ఏకాగ్రతను దెబ్బతీస్తున్నదని ఆందోళన చెందిన కొన్ని దేశాల ప్రభుత్వాలు మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌పై నిషేధాలు కూడా విధించాయి.
ఎందుకిలా..
అసలు సోషల్ మీడియా మనల్ని ఎందుకిలా కట్టిపడేస్తుంది? అది మన దృష్టి, మూడ్, కాన్సన్‌ట్రేషన్, మన ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనే విషయంలో ఇప్పుడు శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు మనుషుల మెదడును నాశనం చేస్తున్నాయి.. అనే వాదనను మరీ పెద్దది చూసి చూడొద్దని కొందరు నిపుణులు అంటున్నారు. అదెలా ఉన్నా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్.. మన సమాచార వినియోగ అలవాట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆధారాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. ఒక పుస్తకం చదువుతూ ఉంటే.. దానికి చివరి పేజీ అంటూ ఒకటి ఉంటుంది. ఒక టీవీ షో.. 20 నిమిషాలకో, 30 నిమిషాలకు ముగిసిపోతుంది. కానీ.. అందుబాటులో ఉన్న ఇన్‌స్టా, ఫేస్‌బుక్, షార్ట్స్ యాప్స్‌లో ఫీడ్స్‌కు అంతూ పొంతూ ఉండదు. అదే మనలో కుతూహలాన్ని పెంచుతూ పోతుంది. మన మెదడుకు డోపమైన్ అనే రసాయనం బాగా నచ్చుతుంది. ఎందుకంటే.. మనకు నచ్చిన కంటెంట్ ఫీడ్‌లో కనిపించినప్పుడల్లా మెదడుకు ఆ డొపమైన్ దొరుకుతుంది. దాంతో ఇక మెదడు మరింత డోపమైన్ కోసం అలా పరిగెడుతూనే ఉంటుంది. ఒకటి తర్వాత మరోటి.. ఆ తర్వాత మరోటి.. ఇలా నెవర్ ఎండింగ్ స్రోలింగ్. దీన్ని మెదడు రివార్డుల కోసం పరుగులు తీయడంగా భావిస్తారు. దీని ఫలితంగానే చాలామంది.. కాసేపు రీల్స్ చూద్దాం అనుకుని మొదలుపెట్టి.. అలా చూస్తూనే ఉంటారు.
డోపమైన్ వెనుక వాస్తవం ఇదీ…
మన మెదడుకు మంచి అనుభూతిని ఇచ్చే రసాయనం డోపమైన్. అంతేకాదు.. ప్రేరణ, ఏదో తెలియని సంతోషకరమైన కంటెంట్ కోసం వెతికే ప్రవర్తనలో కూడా దాని పాత్ర ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియా ఫీడ్స్‌ను వారు గాంబ్లింగ్ మషీన్స్ అని అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఈ రెంటిలోనూ అనిశ్చిత లేదా అనూహ్య రివార్డులు దొరుకుతాయి. అంటే.. కాసేపు స్వైప్ చేసిన తర్వాత ఏదైనా కొత్త, వినోదాత్మక వీడియో కనిపించొచ్చు. అది మెదడును అట్రాక్ట్ చేస్తుంది. లేదా ఒక సంతోషకరమైన అప్‌డేట్ లేదా ఒక సన్నిహిత మిత్రుడి మెసేజ్ కనిపించవచ్చు. అవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు దొరుకుతాయి? అన్న విషయంలో టైమ్ గ్యారెంటీ ఇవ్వలేం. కానీ.. అటువంటి వాటి కోసం అన్వేషణ మాత్రం సాగుతూనే ఉంటుంది. దీన్నే నిపుణులు వేరియబుల్ రివార్డ్ షెడ్యూల్ అని పిలుస్తుంటారు. అంటే.. రివార్డులు (నచ్చిన, సంతోషకరమైన కంటెంట్) ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కాబట్టి.. అది దొరికే దాకా చేతి వేళ్లు కంటెంట్‌ను స్ర్కోల్ చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కొందరు కనిపించే కంటెంట్‌ను ఆస్వాదించకపోయినా, కనీసం గుర్తుపెట్టుకోలేక పోయినా స్క్రోలింగ్ మాత్రం ఆపనుగాక ఆపరు.
కొత్తదనం కోసం అన్వేషణ…
కొత్త విషయాలంటే మెదడుకు అత్యంత ఆసక్తి. ఎదుకంటే.. కొత్త విషయాలు తెలిస్తే అందులో కొత్త సమాచారం లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా తదుపరి పనులకు ఒక సోర్స్ దొరికే అవకాశమూ ఉంటుంది. అదీ కాదనుకుంటే జరుగబోయే ఒక ప్రమాదం గురించైనా తెలుస్తుంది. విషయం ఏంటంటే.. మనం సహజంగానే మనకు తెలియని అనుభవాలవైపు ఆకర్షితులవుతూ ఉంటాం. ఇదే పాయింట్‌ను సోషల్ మీడియా పట్టుకుంది. అదే పాయింట్‌తో సోషల్ మీడియా మనల్ని పట్టేసుకుంటున్నది. ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి పడే కొత్త కంటెంట్. ప్రతి పోస్టులో ఏదో ఒక కొత్త చిత్రం లేదా కొత్త ఫన్నీ వీడియో లేదా ఒక విశ్లేషణ, న్యూస్ హెడ్‌లైన్.. ఇలా ఎదురవుతూ ఉంటాయి. ఇదే మన మెదడును నిరంతరం స్టిమ్యులేట్ చేస్తుంది. మన మెదడుకు కావాల్సిందీ అదే. రాను రాను ఈ అలవాటు.. ఒక సమాచారం నుంచి మరో సమాచారానికి వేగంగా మారిపోయేలా చేస్తుంది. ఇలా మెదడును నిరంతరం స్టిమ్యులేట్ చేసే కంటెంట్‌కు అలవాటు పడిపోవడంతో.. నెమ్మదిగా సాగే పనులు.. అంటే ఏదైనా చదువుకోవడం, అవసరమైన పనులు చక్కబెట్టుకోవడం, ఏదైనా సమస్యలు పరిష్కరించడం, బయటకువెళ్లాల్సిన పనులు చేసుకోవడం వంటివి మనకు అవేవో పనికిమాలినవి అనిపించే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక ఆరోగ్యపు ఫీడ్‌బ్యాక్ లూప్
మనం చూసే కంటెంట్ మనలో బలమైన భావోద్వేగాలను రాజేసినప్పుడు స్క్రోలింగ్ అనేది మరింత పట్టు సాధిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఎవరికైనా మనసుబాగోలేనప్పుడు మరింత సమాచారం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ అదే తరహా కటెంట్ కనిపిస్తే.. వారి మనసు తేలికపడటం కాదు కదా.. మరింత స్ట్రెస్‌కు గురవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. మితిమీరి స్ర్కోల్ చేసేవారిలో మానసిక ఒత్తిడి, నిరాశావాదం, మానసికంగా అలసిపోవడం వంటి లక్షణాలు పెరుగుతాయని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి.
నష్టాలూ లాభాలూ..
సోషల్ మీడియా సమాజాన్ని చెడగొడుతున్న విషయం ఎంత వాస్తవమో.. అనేక నైపుణ్యాలు వెలికి వస్తున్న విషయం కూడా అంటే వాస్తవం. ఇదే సోషల్ మీడియా ఇప్పుడు దేశంలో సంచలనం రేపిన కాక్రోచ్ ఉద్యమానికి నాంది పలికింది. ఇదే సోషల్ మీడియా ద్వారా అనేక మంది మేధావులు తమ అభిప్రాయాలను కోట్ల మందితో పంచుకుంటున్నారు. ఇది మనకు విద్యను అందిస్తుంది. వినోదం కల్పిస్తుంది. మనల్ని సంతోషంగానూ ఉంచుతుంది. అయితే.. అంతూపొంతూ లేని ఫీడ్స్ విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని కట్టడిలో ఉంచుకుంటూ పనికొచ్చే పనులు చేసుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. లేదంటే.. అసలు విషయాలు పక్కకుపోయి.. కొసరు విషయాలపై దృష్టిపెడతాం. స్క్రోలింగ్ విషయంలో సైన్స్ చెప్పేది ఒక్కటే.. మనం స్క్రోలింగ్ ఆపలేకపోతున్నామంటే.. అది కేవలం మనలో సంకల్పం లేకపోవడం ఒక్కటే కాదు.. నిజానికి మన దృష్టి ఎంతసేపైనా అలానే ఉండేలా ఈ ప్లాట్‌ఫామ్స్‌ను ఆ యా కంపెనీలు తయారు చేశాయి. ఇదొక మాయా ప్రపంచం. లొంగిపోతే నష్టం.. అధిగమిస్తే లాభం. సాగిలపడితే అజ్ఞానం.. సరిగ్గా ఉపయోగించుకుంటే విజ్ఞానం.