ఢిల్లీలోని అశోక 5స్టార్ లగ్జరీ హోటల్‌లో.. ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరిట నిర్వహించిన స‌మావేశంలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటాం అని, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చు అని, ఈ మధ్య కాక్రోచ్‌ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం అని, కాక్రోచ్‌ పార్టీని చూస్తే..సుమతి శతకం చలిచీమల పద్యం గుర్తుకొచ్చిందని అన్నారు. చిన్న క్రీమికీటకాలు, చీమలు కూడా బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయని..ఇలాంటి ఆలోచనలు చేసే శక్తులు దేశ సమగ్రతను బలిచేయడానికి సిద్దంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. అలాంటి భావజాలంలో మనం చిక్కుకోవద్దనే ఢిల్లీలో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు.

చిన్న శక్తుల ఆలోచన విధానాలు దారి తప్పితే దేశానికి నష్టదాయకం అని చెప్పుకొచ్చారు.దేశం తాలుకూ గాఢతను, తీవ్రతను, సమగ్రతను అర్ధం చేసుకోకుండా విభజన వాదాన్ని సృష్టించే ఈ తరహా శక్తులలో మనం భాగస్వామ్యం కాకూడదని, అలాంటి వాటికి ఎదురొడ్డి పోరాడాలన్నారు.

పార్టీ ప్రయోజనాలకంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం

పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలు ఎదుర్కొన్నామని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి.. 20 లక్షలకుపైగా సభ్యత్వాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

తెలంగాణ ఏర్పాటుకు జనసేన అడ్డు చెప్పలేదు

తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు అని, 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు.. అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని, అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదు అని…ఇందుకు జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. చాల మంది నాయకులు ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామంటూ చాలా పెద్దలు మాటలు చెబుతారని, వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు అని పేర్కొన్నారు.