2034వరకు నేనే సీఎంగా ఉంటానని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం బాధ్యత నేను తీసుకుంటానని, విద్యార్ధులకు నాణ్యమన విద్య బాధ్యతలను మీరు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయని, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఏర్పాటు అందిస్తున్నాం అని గుర్తు చేశారు.
విద్యాశాఖ మంత్రిగా ఎందుకు వైదొలగాలి..?
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వైదొలగాలని కొందరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని, విద్యాశాఖకు మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేయాలా లేక నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ ఫాస్టు ఇస్తున్నందుకా? అని ప్రశ్నించారు. టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? లేక ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా? అని నిలదీశారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య లక్ష మంది అదనంగా చేరారని గుర్తు చేశారు.
మానవ సంబంధాలను పునరుద్దరించేలా విద్యా విధానం
చిన్నప్పుడు పిల్లలను హాస్టల్‌లో వేస్తున్నాం.. పెద్దయ్యాక తల్లిదండ్రులను వారు వృద్ధాశ్రమంలో వేస్తున్నారని, ఈ పోకడలకు విరుద్దంగా మానవ సంబంధాలను పునరుద్ధరించాలనే ప్రయత్నం చేస్తున్నాం అని రేవంత్ చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారులను చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేం అని, ఆరు నెలలకోసారి మీతో సమావేశమై విద్యారంగం సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చిస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు మీ అనుభవాన్ని విద్యార్థులకు పంచాలన్నదే మా ఆలోచన అన్నారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని,విద్య లేకపోవడమే అసలైన వెనకబాటుతనం అని, ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు చేస్తోందని, ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు 50 వేలుగా ఉందని రేవంత్ పేర్కొన్నారు. మరి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్ కు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని కోరారు.
నాణ్యమైన విద్యకు ప్రణాళికలు..కార్యాచరణ
నెహ్రూ మొదలుకుని దేశాన్ని ఇప్పటిదాక పాలించిన ఆనాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందింది.. ఆకలి తీరింది కాని..కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు అన్నారు. ప్రతీ పేదవాడికి విద్యను అందించడం మాత్రమే సరిపోదు… వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆ దిశగా తెలంగాణను తీర్చి దిద్దే ప్రతినిధులు ఉపాధ్యాయులేనన్నారు. ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లతో సమానంగా ప్రతీ ఏటా టీచర్స్ ను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం అన్నారు.నాణ్యమైన విద్యను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేం? నేనూ మిడిల్ క్లాస్.. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఇటీవల తాను ఓ ప్రభుత్వ పాఠశాల సందర్శన సందర్బంగా గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని ఏమవుతావని విద్యార్ధిని అడిగితే సీఎం అవుతానని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
ప్రపంచ దేశాలను మెప్పించే విద్యార్ధులను తయారు చేయాలి
విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇంగ్లీష్ ఒక్కటే ముఖ్యమనుకుంటుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? అని రేవంత్ ప్రశ్నించారు. 25 ఏళ్లు అమెరికా వైపు చూశాం… ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై అని గుర్తు చేశారు. ఆ దేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
నేను ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడంలేదు అని, నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పని చేసుకుంటూ వెళ్తున్నానని రేవంత్ స్పష్టం చేశారు. నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి అని ఉపాధ్యాయులను కోరారు. ఈ వేదికగా ఉపాధ్యాయులకు నేను ఒకటే సూచన చేస్తున్నానని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని, ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలని సూచించారు. ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం అన్నారు.