మన పండుగలకు ప్రకృతి కి విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతి పండుగ ప్రకృతి లో నుండి ప్రకృతి లోకి అన్నట్లుగా ఉంటాయి. వినాయక చవితి ఉత్సవాలు సామాజిక బాధ్యత ను పర్యావరణ హితం ను చాటి చెప్పే ఉద్దేశ్యం తో ప్రారంభించబడినవి.
అందుకే ప్రకృతి నీ పరిరక్షించుకుంటూ పండుగలను ఆస్వాదించాల్సి ఉంటుంది. ఒక రకం గా చెప్పాలంటే మట్టిని మనుషులంతా ఐక్యంగా పత్రితో పూజించి, మళ్లీ ప్రకృతిలో కలిపే పండుగే వినాయకచవితి. చెరువు, నదుల్లో ని మట్టిని తీసుకొచ్చి, వినాయకుడు విగ్రహాలు చేసుకొని, పొలాల్లో దొరికే రకరకాల మొక్కల పత్రి ఇంటికి తీసుకొచ్చి.. పందిరి వేస్తే పండుగ వచ్చినట్లే. ఇంటి ముంగిట కళ వచ్చి మామిడి తోరణాలు కట్టి, వీధిలో పిల్లలు, పెద్దలు, యువత అంతాకలిసి ఆ మట్టి వినాయకుడిని పూజిస్తారు. ఇలా చెట్టు నుంచి ఆకులు, పొలం నుంచి ధాన్యం, తోట నుంచి పూలు, నేల నుంచి మట్టి.. చుట్టూ ఉన్న ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ గా వినాయకచవితి కి ప్రసిద్ధి ! ప్రకృతి ప్రసాదించే దానిని తీసుకుని దాని విలువను గుర్తించడం… చివరికి తిరిగి ప్రకృతి లోనే కలపడం అనేది చవితి సాంప్రదాయం అని పెద్దలు చెపుతారు. చవితి పండుగ కు వ్యవసాయం కు కూడా మంచి సంబంధం ఉంది. వినాయకుడిని చేసుకున్న మట్టి తిరిగి పొలంలో చేరితే నేల సారవంతమై పంటకు మేలు జరుగుతుందని రైతులు నమ్ముతారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవోపేతమైనవి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సమాజంలో ఐక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి ఈ ఉత్సవాలను బహిరంగ వేదికలుగా మార్చారు. అయితే, మారుతున్న కాలంతో పాటు పండుగ నిర్వహణ తీరులో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఉత్సవాలకు సాంకేతిక హంగులు తోడయ్యాయి. సాంప్రదాయ పద్ధతుల స్థానం లో ఆధునిక సొగసుల ది పై చేయి అవుతుంది. భక్తి కన్నా కీర్తి, సాధారణం కన్నా హైటెక్ ఆర్భాటాలు, కలిసి మెలిసి అనే కన్నా ఒకరి పై ఇంకొకరు గొప్ప అనే భావన వినాయక ఉత్సవాల్లో చోటు చేసుకోవటం బాధాకరం ! భక్తి కి సామాజిక బాధ్యతను జోడించినప్పుడే ఈ ఉత్సవాలకు సంపూర్ణ సార్థకత చేకూరుతుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ లోని మంచి చెడులను అందరం విశ్లేషించుకోవాలి…! ప్రకృతి నీ కాపాడుకునేలా, మానవాళి సంబర పడేలా మండపాల నిర్వహణ ఉండాలి. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను నిర్వాహకులు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉత్సవాల వెనుక ఉన్న ఉదాత్తమైన మంచి నీ అర్థం చేసుకోవాలి ! ఉత్సవాల ద్వారా సామాజిక ఐక్యత సాధించబడాలి ! కులమతాల అంతరాలకు అతీతంగా వీధిలోని వారంతా ఒకే చోట చేరి పండుగ జరుపుకోవడం వల్ల సమాజంలో బంధాలు బలపడతాయి అనే భావన ఈ గణపతి వేడుకల్లో ప్రధానమైనది. పలు రకాల కళలు, ఆ సమూహం లో దాగి ఉండే ప్రతిభ కు వేదిక నవరాత్రుల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు అద్దంపడతాయి. పిల్లలు, యువత లోని సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసేందుకు కూడా ఈ నవరాత్రి వేడుకలు దోహదపడతాయి ! సేవా కార్యక్రమాలు కూడా వీటి ద్వారా జరుగుతుండటం విశేషం ! అనేక ఉత్సవ కమిటీలు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సామాజిక సేవలను నిర్వహించడం అభినందనీయం. ప్రస్తుతం ఇటువంటి అనేక విశిష్టతలు క్రమేణ కనుమరుగవుతున్నాయి అనే ఆవేదన వ్యక్తం అవుతున్నది.
నిర్వహణలో దొర్లుతున్న లోపాలు ను గుర్తించి వాటిని సరిదిద్దు కోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది. ముఖ్యం గా మట్టి విగ్రహాల వాడకం బాగా తగ్గిపోయింది ! పర్యావరణానికి ఇది ఎంతో ప్రమాదకర సంకేతం గా నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో కూడిన భారీ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాశయాలు కలుషితమై, మూగజీవాల తో పాటు, మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. దీనిని మించి శబ్ద కాలుష్యం (సౌండ్ పొల్యూషన్) కూడా పెను ప్రమాదం గా మారింది. అర్థరాత్రి వరకు మితిమీరిన శబ్దంతో మోగే డీజేలు, మైకుల శబ్దాలు వల్ల వృద్ధులు, రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. భక్తి తో చేయాల్సిన ఉత్చవాల ను కొందరు తమ వ్యక్తిగత ప్రతిష్ఠ గా భావిస్తున్నారు. మిగతావారికంటే తమ విగ్రహం పెద్దది గా ఉండాలని, తమ పందిరి గొప్ప గా కనపడాలని భావిస్తున్నారు. ఇందుకోసం సినిమా సెట్టింగ్ లను తలపించేలా భారీ హంగులతో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యధిక ఓల్టేజీలతో కూడిన విద్యుత్ దీపాలు పెడుతున్నారు. తొమ్మిది రోజుల వేడుకకు లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇవన్నీ ఉత్చవాల స్పూర్తి నీ ఎంతోకొంత నీరుగారుస్తున్నాయనే చర్చ వినబడుతోంది. నిర్వహణ కు ఆర్థిక భారం తడిసి మోపెడు అవుతుండటం తో అక్కడక్కడ బలవంతపు చందాలు కు, ఆర్థిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పండుగ పేరిట వ్యాపారస్తు లను, సామాన్యులను చందాల కోసం బలవంతం చేయడం భక్తి భావన కే విరుద్ధం అని చెపుతున్నారు. భారీ హంగులతో జరిగే వేడుకల్లో ఆయా ఆర్థిక స్థాయి ఉన్న వ్యక్తులకే చోటు ఉంటుందని, సామాన్యులు వెళ్లాలంటే వెనకాడే పరిస్థితి నెలకొంటున్నది.
పండుగ విశిష్టత హంగులు, ఆర్భాటాల లో లేదు అని. భావించాల్సిందిగా పెద్దలు సూచిస్తున్నారు. అది మన అంతరంగ శుద్ధి లో, పర్యావరణ పరిరక్షణలో ఉంటుందని చెపుతున్నారు. విగ్రహాల పరిమాణం కంటే భక్తి ప్రాధాన్యం పెరగాలి. మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం, పరిమిత శబ్దంతో పూజలు నిర్వహించడం, పండగ నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం వంటి అంశాలు ప్రధానం కావాలని అందరూ కోరుతున్నారు. పండుగ ఆనందం ప్రకృతికి, ఇతరులకు హాని కలిగించనప్పుడే ఆ విఘ్నేశ్వరుని అను గ్రహం భక్తులకు లభిస్తుందని గ్రహించాలి ! మట్టి మన మూలం. ప్రకృతి మన ఆధారం. మనమంతా వాటిని ఉపయోగించుకుంటూ జీవనం సాగించాలి. అదే ఈ వినాయకచవితి పండుగ మానవాళికి ఇచ్చే సందేశం ! ఈ సందేశాన్ని స్వీకరిస్తూ….గౌరవిస్తూ…. వినాయకుడి వేడుకలు జరుపుకుందాం !!