ప్రవైట్, కార్పోరేట్ విద్య మోజులో పడి లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించలేక విద్యాసంస్థల దోపిడీకి గురవతున్న నేటి సమాజానికి కనువిప్పు కలిగే నిర్ణయంతో ఓ గ్రామం సంచలనంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలకు పంపితే పిల్లలకు క్రమశిక్షణాయుతమైన, నాణ్యమైన చదువు అందదని ఆలోచనలతో ఉన్న తల్లిదండ్రులకు భిన్నంగా.. మా పిల్లలను సర్కార్ బడిలోనే చదివిస్తామంటూ ఊరు ఊరంతా తీర్మానం చేసుకున్న ఘటన హాట్ టాపిక్ గా మారింది. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందా మండలంలోని బాబాపూర్ గ్రామస్తులు మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు అంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాదు మా ఊరిలోని పిల్లలందరిని ప్రభుత్వ బడికే పంపిస్తామంటూ ఊరు ఊరంతా ఒక్కటయి తీర్మానం సైతం చేసుకున్నారు.
తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాల బస్సులు కూడా రావద్దని.. కాదు కూడదని ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే జరిమానా విధింపు ఉంటుందంటూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ పడిగెల లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపిస్తామని ప్రైవేట్ బడులకు పంపించబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ బడులు బాగు పడాలంటే స్థానికులే ముందుకు రావాలని వారు తమ ఆదర్శనీయమైన నిర్ణయంతో చాటి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో మా ఊరి వాళ్లం అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సర్పంచ్ పడిగెల లక్ష్మి చొరవ తీసుకుని…ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్‌లో బోధన.. మధ్యాహ్న భోజనం.. ఆట స్థలం..ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలపై బాబాపూర్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ మాటకు జై కొట్టిన గ్రామస్తులు ఊరు ఊరంతా ఒక్కటై సర్కార్ బడులకే మా పిల్లలను పంపిస్తామని ప్రైవేట్ పాఠశాలకు పంపించబోమని తీర్మానం చేసి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శనీయంగా నిలిచారు.