గ్రీకు పురాణాల్లో అత్యంత ప్రసిద్ధ కథల్లో ఒకటి ఈ పాండోరా బాక్స్ కథ. మొదటి ట్విస్ట్ ఏమిటంటే.. నిజానికి గ్రీక్ పురాణంలో పేర్కొన్నదాని ప్రకారం అది పెట్టె కాదు. ఒక మట్టి జాడీ. పదహారవ శతాబ్దం నాటి పండితుడు ఎర్మాస్ తన అనువాదంలో జార్ స్థానంలో బాక్స్ అనే పదం వాడిన తర్వాత పాండోరా బాక్స్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది.
కథ మొదలైందిలా…
గ్రీకు పురాణాల్లో ఒక పాత్ర అయిన ప్రోమీథియస్.. (అత్యంత గొప్ప, మానవాళిని ప్రేమించిన టైటాన్‌లలో ఒకడు.) అగ్నిని దేవతల నుంచి తస్కరించి.. మనుషులకు ఇవ్వడం ఈ కథకు నాంది. అధిదేవుడైన జ్యూస్ (గ్రీకు పురాణాల్లో దేవతలందరికీ రాజు. ఆకాశం, ఉరుములు, మెరుపులు, న్యాయం, రాజ్యాధికారం, క్రమశిక్షణకు అధిపతిగా భావించేవారు.) దీన్ని తీవ్ర అవమానకరంగా భావిస్తాడు. ఈ పని చేసిన ప్రోమీథియస్‌ను శిక్షించడమే కాకుండా.. దేవతల నుంచి పొందిన అగ్నిని వాడుకునే మనుషులందరికీ గట్టి గుణపాఠం చెప్పాలని జ్యూస్ భావిస్తాడు. ఒక మహిళను సృష్టించిన జ్యూస్.. దేవతలందరినీ పిలిచి, ఆ మహిళకు ప్రతి దేవుడు ఒక వరం ఇవ్వాలని చెబుతాడు. ఆమెకు పెట్టిన పేరు పాండోరా. పాండోరా అంటే గ్రీక్ భాషలో పాన్.. అన్ని, డోరా.. వరాలు.. అన్ని వరాలు పొందిన మహిళ అని అర్థం. గ్రీకు పురాణాల ప్రకారం.. ఆమె శరీరాన్ని పెఫైస్టస్ (గ్రీకు పురాణాల్లో అగ్ని, లోహకళ, కమ్మరి వృత్తి, ఆయుధాల తయారీ, శిల్పకళలకు దేవుడు) మట్టితో రూపొందించాడు. నేత పని, చేతి పనకులను అథీనా (జ్ఞానం, వివేకం, యుద్ధ వ్యూహం, కళలు, చేతివృత్తులు, న్యాయం, నాగరికతకు దేవత.) నేర్పుతుంది. అఫ్రొడైటీ (ప్రేమ, సౌందర్యం, ఆకర్షణ, కోరిక, వివాహం, సంతానోత్పత్తికి దేవత) అపూర్వమైన అందాన్ని ప్రసాదిస్తుంది. హెర్మీస్..(అత్యంత చురుకైన, తెలివైన దేవతలలో ఒకడు. అతను దేవతల దూత. ప్రయాణికులు, వ్యాపారులు, దొంగలు, క్రీడాకారులు, గొర్రెలకాపరులు, వక్తలు, ఆత్మలను పాతాళలోకానికి తీసుకెళ్లే మార్గదర్శి.) తెలివి, చాకచక్యం, మాటలతో మాయ చేసే గుణాలను కల్పించాడు. కొన్ని కథల్లో ఆమెకు మోసం చేసే స్వభావాన్ని సైతం ఇచ్చినట్టు చెబుతారు. ఇక జ్యూస్ భార్య హీరా.. (దేవతల రాణి, వివాహం, కుటుంబం, స్త్రీల సంరక్షణ, ప్రసవానికి దేవత) ఆమెకు రాజసాన్ని కల్పిస్తుంది. ఇలా మిగిలిన దేవతలు కూడా పాండోరాకు తలో వరం ఇస్తారు.
ప్రతీకారం కోసం సృష్టి…
పాండోరా కథలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమెను ప్రేమ కోసం కాదు.. ప్రతీకారం కోసం అంటే ‘అందమైన ఉచ్చు’గా ఉపయోగించుకోవడం జ్యూస్ ఉద్దేశం. అగ్నిని దొంగిలించిన ప్రోమీథియస్‌కు ఎపిమీథియస్ (గ్రీకు పురాణాల్లో ఒక టైటాన్. ప్రోమీథియస్ సోదరుడు. వారి పేర్ల ప్రకారం.. ప్రోమీథియస్ ముందుగానే ఆలోచించేవాడు, ఎపిమీథియస్ పని అయిపోయాక ఆలోచించేవాడు) అనే సోదరుడు ఉన్నాడు. వాస్తవానికి జ్యూస్ ఇచ్చే ఏ బహుమతిని కూడా స్వీకరించవద్దని ప్రోమీథియస్‌ను ఎపిమీథియస్ ముందే హెచ్చరిస్తాడు. కానీ.. జ్యూస్ ఊహించిన విధంగానే పాండోరా అందాన్ని చూసి ఆమెను ప్రోమీథియస్ వివాహమాడుతాడు. వివాహంలో కానుకగా ఒక పెద్ద మట్టి జీడీని పాండోరాకు జ్యూస్ ఇస్తాడు. కానీ.. ఒక షరతు విధిస్తాడు. దీన్ని ఎప్పుడూ తెరవకూడదని హెచ్చరిస్తాడు. ఎందుకో మాత్రం చెప్పడు. దాంతో పాండోరాకు ఆ జాడీపై ఆసక్తి కలుగుతుంది. రోజులు గడిచే కొద్దీ అసలు ఆ జాడీలో ఏముంది? అని తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. టెన్షన్ భరించలేక ఆ జాడీ మూత తెరుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
అందులో ఉన్నవి ఇవీ…
పాండోరా తనకు జ్యూ్‌స్ కానుకగా ఇచ్చిన జాడీని తెరువగానే దానిలోనుంచి నల్లని పొగలా వేల కొద్దీ దుష్టశక్తులు బయటకు వస్తాయి. సకల వ్యాధులు, బాధలు, ఆకలి, దారిద్ర్యం, పేదరికం, వృద్ధాప్యం, అసూయ, ద్వేషం, యుద్ధాలు, మరణ భయాలు, కష్టాలు, దుఃఖాలు… అన్నీ ఒక్కసారిగా జడలు విప్పుతాయి. వాస్తవానికి అప్పటి వరకూ ప్రజలకు ఇవేవీ తెలియదని గ్రీకు పురాణాలు పేర్కొంటున్నాయి.
అప్పటికే మించి పోయింది…
జాడీలో నుంచి వచ్చిన దుష్టశక్తులను చూసి పాండోరా భయపడిపోయి.. వెంటనే మూత మూసేస్తుంది. కానీ.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. దుష్టశక్తులన్నీ జాడీ నుంచి బయటకు వెళ్లిపోతాయి. కానీ.. ఒక్కటి మాత్రం అందులోనే ఉంటుంది. అదే.. ఎల్పిస్ (Elpis). అంటే.. ఆశ.
ఆశ మాత్రమే ఎందుకు మిగిలింది?
ఈ మొత్తం కథలో ఇదే అత్యంత కీలకమైన అంశం. దీన్ని అనేకమంది గ్రీకు రచయితలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొదటి అర్థ.. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా.. మనుషులను ఆశ మాత్రం విడిపెట్టదు. అందుకే సర్వస్వం కోల్పోయినవారు సైతం ఆశతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది పండితులు ఆశ కూడా బయటకు రాలేదని చెబుతారు. దానర్థం.. పూర్తిస్థాయిలో ఆశను మనుషులు ఎప్పటికీ పొందలేరని, అది ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉంటుందని వారి భావన.
పాండోరా తప్పు చేసిందా?
ఈ కథపై ఆధునిక కాలంలో మరో కోణంలోనూ చర్చ సాగుతున్నది. చాలా కాలం పాటు పాండోరాను అన్ని కష్టాలకు కారణమైన మహిళగా చిత్రీకరించారు. కానీ.. అసలు తప్పు పాండోరా చేసిందా? లేక ఆమె కుతూహలాన్ని పరీక్షించేందుకు జ్యూస్ వేసిన ఎరా? అనే ప్రశ్నలు ఉన్నాయి. మానవుల జిజ్ఞాస, దైవాధికారం మధ్య ఘర్షణగా దీన్ని విశ్లేషించేవారూ ఉన్నారు. వద్దు అన్న పనిని చేయాలనే కుతూహలం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందనే భావన అనేక సంస్కృతుల్లో కనిపిస్తూ ఉంటుంది.
ఒక పాత్ర.. రెండు సమాధానాలు
ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి? అనే ప్రశ్నకు పాండోరా పెట్టెను ఉదాహరణగా చూపిస్తూ గ్రీకు పురాణం సమాధానం ఇస్తుంది. అదే సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషిని నిలబెట్టి ఉంచేంది ఆశ అనే బలమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. ఆ కారణంగానే పాండోరా బాక్స్ అనే పదబంధం ఇప్పటికీ విస్తృతంగా వినియోగంలో ఉంటున్నది.