‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ

కొన్ని రోజులుగా వార్తలలో బాగా హైలెట్ అవుతోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’.

Reported by: raj | వినోదం | Sep 04, 2026, 6:43 am IST
Read Time: 12 mins
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ

మూవీ పేరు: ‘ధర్మస్థల నియోజకవర్గం’
విడుదల తేదీ: 04-09-2026
నటీనటులు: సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, శివ, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు
డైలాగ్స్: అస్లాం
ఎడిటింగ్: సాయిబాబు తలారి
సంగీతం: మహావీర్ ఎల్లంధర్
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల
డిఓపి: వెంకట హనుమ
లిరిక్స్: చంద్రబోస్,
నిర్మాత: మేరుం భాస్కర్
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట

కొన్ని రోజులుగా వార్తలలో బాగా హైలెట్ అవుతోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ‘రంగస్థలం’ తర్వాత ఆస్కార్ విజేత చంద్రబోస్.. ఆ స్థాయి సాహిత్యం ఈ సినిమాకు ఇచ్చానని చెప్పడం, మొదటి నుంచి ఈ సినిమా టీమ్‌కు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తుండటంతో.. ఈ సినిమాలో ఏదో విషయం ఉందనే భావనని కలిగించారు. సుమన్, సాయి కుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు‌తో పాటు సీనియర్ నటీమణి కస్తూరి ఇందులో విలన్ పాత్ర చేస్తున్నట్లుగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడంతో.. ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నారని.. జనాల్లో ఈ సినిమాపై టాక్ నడిచింది. సినిమా ప్రమోషన్స్, విడుదలైన పాటలు, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేశాయి. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా.. ఆ క్రేజ్‌కు తగిన సక్సెస్‌ని అందుకుందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ధర్మస్థలంలో వరుసగా 7 ఏళ్లుగా పోటీ లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తున్న బైరాజ్‌ (సాయికుమార్).. ఆ నియోజకవర్గానికి చేసేది ఏమీ ఉండదు. దేవకి, వసుదేవుల అష్టమ సంతానమైన శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుడిని చంపినట్లుగా.. ఎనిమిదోసారి మాత్రం ఓ టీ షాపు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్) చేతిలో దారుణంగా ఓడిపోతాడు. టీ షాపు నడుపుకునే వ్యక్తి, అసలు రాజకీయాలలోకి ఎందుకు రావాలని అనుకుంటాడు? ఆయన కుమారుడు బద్రి (నటరాజ్) చనిపోవడానికి కారణం ఏంటి? కాలేజ్ లెక్చరర్ అరుంధతి (వితికా షేరు) పోరాటం దేని కోసం? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘ధర్మస్థల నియోజకవర్గం’. నేటి కళాశాలల పనితీరు, విద్యార్థుల భవిష్యత్తుని చిదిమేస్తున్న మాదకద్రవ్యాలు, రాజకీయ నాయకులు డబ్బు కోసం ఏమేం చేస్తున్నారనే అంశాలను మేళవిస్తూ దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట చేసిన ప్రయత్నమే ఈ సినిమా.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇందులో స్టార్ యాక్టర్స్ అయిన సుమన్, సాయి కుమార్‌ పోటాపోటీగా నటించారు. ఒకరు టీ షాపు నడుపుకునే వ్యక్తిగా, మరొకరు పొలిటికల్ లీడర్‌గా ఇందులో కనిపించారు. సాయి కుమార్ పాత్ర కనిపించిన ప్రతిసారి డైలాగ్స్‌కు కొదవలేదు. ఈశ్వరయ్య పాత్రలో సుమన్‌ మరోసారి తన వైవిధ్యతను చాటుకున్నారు. మూడో పాత్ర విషయానికి వస్తే ‘వితికా షేరు’ పాత్రకు దర్శకుడు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సమాజం కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం తాపత్రయపడే ఒక లెక్చరర్‌గా వితికా పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సుమన్ కుమారుడిగా చేసిన నటరాజ్ (టాలెంటెడ్ యాక్టర్ సత్య ప్రకాశ్ తనయుడు)కు తెలుగులో ఇది మొదటి చిత్రమే అయినా, అనుభవం ఉన్న నటుడిగా పాత్రకు న్యాయం చేశారు. ఫస్టాఫ్‌లో తనపై వచ్చే ట్విస్ట్, సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. నటరాజ్‌కు ప్రేయసిగా, తోటి విద్యార్థినిగా నటించిన రాయంచ కనిపించిన ప్రతి సీన్‌లో చాలా అందంగా కనిపించింది. ఇక ఫస్ట్ టైమ్ విలన్‌గా కనిపించిన ‘కస్తూరి’.. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందనే చెప్పాలి. అయితే ఆమె నుంచి ఇంకా ఏదైనా కొత్తగా చేయిస్తే బాగుండేది అనే ఫీలింగ్ చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతుంది. అరుణ్‌గా వరుణ్ సందేశ్ కనిపించిన సన్నివేశాలన్నీ హృద్యంగా ఉంటాయి. రాజీవ్ కనకాల, శివలకు కాస్త స్కోప్ ఉన్న పాత్రలు పడ్డాయి. శివ వాడే బైక్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. షఫీ, రాజా రవీంద్ర రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు. వారికి పెద్దగా చేయడానికి ఏం లేదు కానీ, ‘పెద్ద’ పనినే వారు తలకెత్తుకుంటారు. పృథ్వీ, కాలకేయ ప్రభాకర్.. ఇంకా ఇతర తారాగణం అంతా ఓకే.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మొదటి నుంచి టీమ్ చెప్పినట్లుగా చంద్రబోస్ పాటలు కథతో నడుస్తూ, కథని నడిపిస్తాయి. ఆయన సాహిత్యంలో ఉన్న డెప్త్ ఈ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. వెంకట్ హనుమ సినిమాటోగ్రఫీ, మహావీర్ ఎల్లంధర్ మ్యూజిక్, అస్లాం డైలాగ్స్ మంచి మార్కులు వేయించుకుంటాయి. ఆర్ట్, ఎడిటింగ్ ఓకే. నిర్మాత మేరుం భాస్కర్ మంచి సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకుని, తన ప్యాషన్‌ని చాటుకున్నారు. వాస్తవానికి ఆయన ఈ సినిమాకు పెట్టిన ఖర్చుతో.. యూత్‌ని ఆకర్షించేలా ప్రేమకథనే తీయవచ్చు. కానీ, సమాజానికి తన వంతుగా ఏదో చెప్పాలనే థాట్‌తో ఆయన ఈ సబ్జెక్ట్‌కి ఓకే చెప్పి ఉంటారని అనిపిస్తోంది. ఇక దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట కూడా.. మొదటి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎన్నుకోవడం సాహసమనే చెప్పాలి. ఇందులో ఆయన మెయిన్‌గా రెండు అంశాలను టార్గెట్ చేశారు. రెండింటికీ న్యాయం చేస్తూ ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే ఆకర్షిస్తుంది. అలాగే మొదటి సినిమానే అయినా, ఇంతమంది స్టార్ యాక్టర్స్‌‌ని ఆయన డీల్ చేయడం మాములు విషయం కాదనే చెప్పుకోవాలి.

విశ్లేషణ:
ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. సమాజంలో మార్పు రావాలని ధృడంగా సంకల్పిస్తే.. కాస్త ఆలస్యమైనా కచ్చితంగా మార్పు వస్తుంది అనే విషయాన్ని వితికా పాత్రతో దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. మార్పు గురువు దగ్గరే, గురువుతోనే సాధ్యం అనే దర్శకుడి ఆలోచన.. అందరినీ ఆలోచింపజేస్తుంది. అలాగే నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు డబ్బు కోసం ఏమేం గడ్డి కరుస్తున్నారనే విషయాన్ని.. ఎవరినీ హర్ట్ చేయకుండా చెప్పగలగడం.. ఆయనలోని టాలెంట్‌కు తార్కాణం. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పటికీ, చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పారు. పాలిటిక్స్‌లో మంచి వాళ్లు, సేవ చేయాలనుకునే వారు ఉంటే.. ఎలా పనులు జరుగుతాయి, ప్రజలు ఎలా వారిని నెత్తిన పెట్టుకుంటారనే దానికి ఉదాహరణగా ఇందులో వరుణ్ సందేశ్‌తో చెప్పించిన డైలాగ్ ఒక్కటి చాలు. బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన అల్లర్ల వెనుక ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఎలా పని చేస్తాయనే విషయాన్ని కూడా దర్శకుడు ఇందులో జోడించడం చూస్తుంటే.. దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తుంది. మొత్తంగా అయితే.. ఇది ఒక్క నియోజకవర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు.. దేశం, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన ఒక పాఠం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎక్కడా, ఎలాంటి వల్గారిటీ లేకుండా.. ఒక మంచి మెసేజ్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని ఎటువంటి ఆలోచనా లేకుండా ఒకసారి చూడొచ్చు.

ట్యాగ్‌లైన్: ప్రతి నియోజకవర్గానికి ఒక పాఠం
రేటింగ్: 3.25/5