విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ సినిమా జులై 3న విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో సినిమాపై మంచి హైప్‌ను సృష్టిస్తోంది. మిస్టరీ, పురాణ గాథలు, నిధులు, సాహసయాత్ర ప్రధానాంశాలుగా రూపొందించిన ‘నాగబంధం’ సినిమా సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా రన్ టైమ్ ఎక్కువ అనిపించినప్పటికీ.. సినిమా కథాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెద్ద సమస్య కాదంటున్నారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నాగర్కర్, రిషబ్ సాహ్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్‌ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్‌ ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉండబోతుందంటున్నారు.

సినిమా కోసం అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిమ తయారీ

అనంత పద్భనాభ స్వామి కేంద్రంగా సినిమా కథాంశం రూపొందిన నాగబంధం షూటింగ్ కోసం సినిమా మేకర్స్ ఏకంగా ఆ స్వామి వారి నిజ విగ్రహాన్ని తలపించే రీతిలో విగ్రహ ప్రతిమ తయారు చేసి చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. తాజాగా సినిమా ప్రచార పర్వంలో భాగంగా ఈ సినిమా కోసం రూపొందించిన అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిమ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వీడియోలో అనంత పద్మనాభస్వామి అద్బుతంగా కనిపిస్తుండగా..దీనికోసం సినిమా ఆర్ట్ వర్క్ బృందం పడిన కష్టం తెరపైకి మరింత బాగా చూడవచ్చంటున్నారు మేకర్స్. కేరళలోని అసలు దేవాలయానికి అచ్చుగుద్దినట్లు ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయ సెట్ ను హైదరాబాద్‌లో సుమారు రూ. 10 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

పాన్ ఇండియా బ్యాక్‌ డ్రాప్‌లో వస్తోన్న నాగబంధం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జులై 3న విడుదల చేయనున్నట్లుగా నిర్మాత నిషితానాగిరెడ్డి వెల్లడించారు. ‘‘రెండేళ్ల పాటు ఎంతో శ్రమించి రూపొందించిన చిత్రమిది’’ అన్నారు.