విధాత : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతగా అందించాలని నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటంతో ఆగస్టు 1నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి జిల్లాలలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతీ నెల మొదటి 15 రోజులు మాత్రమే బియ్యం ఇచ్చేవారు. ఆగస్టులో డీలర్లు 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించాలి. ప్రతి కార్డుదారు మూడుసార్లు బయోమెట్రిక్ వినియోగించాలి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు రెండు, మూడు ధఫాలుగా సరిపడా బియ్యాన్ని రవాణా చేయనున్నారు. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు, మూడుసార్లు రవాణా చేస్తారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒకే నెలలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జులై కోటా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు 2.15 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. బయోమెట్రిక్ ధ్రువీకరణతో పారదర్శకంగా పంపిణీ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
31 వరకు ఈ-కేవైసీ గడువు
మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈ-కేవైసీని (e-KYC) పౌరసరఫరాల శాఖ తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తిచేసిన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా చేయనున్నారు. దీనికోసం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చారు.