స్థిరంగా బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా సంక్షోభంతో కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతున్న బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా నిలిచాయి. బులియన్ మార్కెట్ లో ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 19, 2026, 11:10 am IST
Read Time: 5 mins
స్థిరంగా బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత ఆరు వారాల్లోనే అత్యంత భారీగా బంగారం ధరలు పతనమయ్యాయి. ఈ వారంలో ఇప్పటివరకు బంగారం ధరలు 3 శాతానికి పైగా క్షీణించాయి. అయితే ఆదివారం హెచ్చు తగ్గులకు విరామం ప్రకటిస్తున్నట్లుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా నిలిచాయి.

బులియన్ మార్కెట్ లో ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతుండగా..   22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

మరికొంత కాలం తగ్గుదల..ఆపై పైపైకి..

అమెరికా మద్దతుతో ఇరాన్‌పై యుద్ధ వాతావరణం నెలకొన్న ఫిబ్రవరి చివరి నుండి ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 25 శాతం మేర పడిపోవడం గమనార్హం. యుద్ద పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్క వారంలోనే 14 శాతానికి పైగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల అంతిమంగా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందనే భయాలను రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచుతుందనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బంగారం తన గరిష్ట స్థాయి ఔన్సుకు 5,405 డాలర్ల నుండి 26 శాతం పడిపోయి 4,006 డాలర్ల వైపుకు చేరగా.. వెండి మరింత పతనమై 118 డాలర్ల గరిష్ట స్థాయి నుండి సగానికి పైగా క్షీణించి 56 డాలర్ల సమీపానికి చేరింది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరికొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొనుగోలుకు బెస్ట్ టైమ్..

అయితే ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం భవిష్యత్తులో ఈ రెండు విలువైన లోహాల ధరలు ఊహించని రీతిలో భారీగా పెరిగి ఆకాశాన్ని తాకుతాయని అంచనా వేశారు. మార్కెట్ ఎప్పుడూ ఒకే సరళరేఖలో పైకి వెళ్లదని.. మధ్యమధ్యలో వచ్చే తీవ్రమైన వెనుకంజలు, పతనాలు లేదా అధిక అస్థిరత వంటివి మార్కెట్ యొక్క సహజ లక్షణాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం, వెండి ధరల తగ్గుదలను ఒక ప్రతికూల అంశంగా చూడకుండా.. మరింత ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నట్లు కియోసాకి వెల్లడించారు.