సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌(సర్) గడువు పూర్తయ్యేదాకా ఆగస్టు 3 వరకు ఎవరు కూడా గాంధీభవన్ రావద్దని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పదవుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 19, 2026, 1:38 pm IST
Read Time: 5 mins
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :ఎస్‌ఐఆర్‌(సర్) గడువు పూర్తయ్యేదాకా ఆగస్టు 3 వరకు ఎవరు కూడా గాంధీభవన్ రావద్దని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పదవుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి సర్‌పై నిర్వహించిన జూమ్‌ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ప్రక్రియ చాలా కీలకమైనదని, ఎవ్వరు కొంచం కూడా నిర్లక్ష్యం చేయవద్దు అని హితవు పలికారు. కొందరు నేతలు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సర్‌పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సర్‌పై 489 భేటీలు జరిగాయని, సర్ ప్రక్రియలో వెనుకబడిన నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఛైర్మన్‌ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దు. పదవుల కోసం వచ్చే వారికి గాంధీభవన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు అని తేల్చి చెప్పారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నేతలు సమర్థంగా ఉపయోగించాలని, పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతామంటే కుదరదని చెప్పారు.

ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని మార్గదర్శకం చేశారు. సర్ ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు. పార్టీ పరంగా సర్‌ ఇన్‌ఛార్జిలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, బీఎల్‌వోల నివేదికల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలని సూచించారు. బీఎల్‌వోల రిపోర్టులపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయి అని తెలిపారు. దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలను గుర్తించి ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దని సూచించారు.

వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని, సర్‌కు నియమించిన పార్టీ ఇన్‌ఛార్జిలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని, ఈనెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం అని తెలిపారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలని సూచించారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్‌ గాంధీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.