సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో జరుగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులందరూ తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు.
కేబినెట్ అత్యవసర సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, మూసీ పునరుజ్జీవనం ఫేజ్-1 పనులు, మెట్రో విస్తరణతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు,కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మడి హట్టి పథకం, కాళేశ్వరం పంపుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలినినో తో నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితులను సమీక్షించి, కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుందని తెలుస్తుంది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.