సమస్యల నెలవులు..తెలంగాణ గురు కులాలు: విద్యార్ధుల ఆందోళన

తెలంగాణ గురుకులాల్లో నీటి కొరత, నాసిరకం వసతులు, పారిశుద్ధ్య సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ గురుకుల విద్యార్థినులు రోడ్డెక్కి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 16, 2026, 5:00 pm IST
Read Time: 5 mins
సమస్యల నెలవులు..తెలంగాణ గురు కులాలు: విద్యార్ధుల ఆందోళన

తెలంగాణ గురుకులాల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. అద్దె భవనాలు..అరకొర వసతులు..అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారం, అమలు కాని మెను వంటి సమస్యలతో విద్యార్థిని విద్యార్ధులు నిత్య నరకం చూస్తున్నారు. ఎక్కువగా పేద, బలహీవ వర్గాల విద్యార్ధులు చదవుతున్న గురుకులాలలో ఫలితాలు మెరుగ్గా వస్తుండటంతో గురుకులాలపై క్రేజ్ తగ్గడం లేదు.తీరా గురుకులాలలో జాయిన్ అయ్యాక మాత్రం ఎందుకు చేరాం ఇక్కడా అనుకుటం విద్యార్థులు అక్కడి సమస్యలతో వేగలేక నిత్యం మధన పడిపోతున్నారు.

స్వయంగా విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నప్పటికి తెలంగాణలో గురుకులాల మౌలిక వసతులు గాడిన పడకపోతుండటం విమర్శలకు తావిస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు నీళ్ల కోసం రోడ్డెక్కి ధర్నాకు దిగడం గురుకులాల సమస్యల తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.

గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్ధినిలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వాష్ రూమ్‌కి పోదామంటే కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, నీళ్ల సమస్య పరిష్కరించాలని కోరితే..ఒక్కొక్కరికి రూ.20 చొప్పున డబ్బులు ఇస్తే సమస్య తీరుస్తానని ప్రధానోపాధ్యాయుడు చెప్తున్నాడని విద్యార్ధినిలు వాపోయారు. రూల్ నంబర్లు వేసి మరి.. మాతో బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారని, లేదంటే మీరే శుభ్రం చేసుకోండి అని ప్రిన్సిపాల్ మేడం అంటుందని తెలిపారు.

ఇదేంటని అడిగితే వేధిస్తున్నారని, పైగా సమస్యలపై అడిగిన విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్నారని..మార్కులలో కోత పెడుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దోమలు, పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీ లాగా అవుతుందని, పాములు రావడం సాధారణంగా మారిపోయిందని వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధినిలు డిమాండ్ చేశారు.