ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ జాఢలు మరోసారి ఏపీలో ప్రత్యక్షమయ్యాయి. మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రిలో ఓ రోగికి కొవిడ్ అనుమానిత లక్షణాలను గుర్తించారు. ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తికి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సదరు బాధితుడిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తూ ఇంటికి పంపించారు.
ఇటీవల కాలంలో వివిధ రకాల జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, అలాగే కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఎయిమ్స్ వైద్యులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరోనా కేసుల నమోదు నేపథ్యంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ‘ఫీవర్ వార్డు’ను ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, జ్వరంతో వచ్చే రోగులకు ఇక్కడే ప్రత్యేక వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేపట్టారు.
మరోవైపు ఎయిమ్స్‌లో కొవిడ్ కలకలం రేగడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) వైద్యులు సైతం అప్రమత్తమయ్యారు. జీజీహెచ్ అధికారులు కరోనా కేసుల నిర్ధారణకు అవసరమైన ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్టింగ్ కిట్లను సిద్ధంగా ఉంచారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మాస్కులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.