మయన్మార్ మైనార్టీలైన రోహింగ్యాలు ప్రయాణిస్తోన్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయిన ఘటనలలో 500 మందికిపైగా గల్లంతైనట్లుగా సమాచారం. అంతర్జాతీయ వలసల సంస్థ, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ తమ సంయుక్త ప్రకటనలో పడవల మునక ప్రమాదాన్ని వెల్లడించాయి.
జూన్ చివర్లో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రతీరం నుంచి రెండు పడవలు బయల్దేరాయని, ఆ ప్రయాణికుల్లో అత్యధికులు రోహింగ్యాలేనని ఆ సంస్థలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లోని కొందరు కూడా ఆ పడవలు ఎక్కారని పేర్కొంది. అయితో 250 మందితో బయలుదేరిన పడవ కొద్దిసేపటికే కాంటాక్ట్ కోల్పోయిందని, 280 మంది ప్రయాణికులతో కూడిన పడవ సైతం జులై 8న అయేయార్వాడీ తీరంలో మునిగిపోయిందని పేర్కొన్నాయి.
ఆ రెండు పడవ ప్రమాదాలపై అంతర్జాతీయ వలసల సంస్థ, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదికల ప్రకారం.. రెండు పడవల్లోని ప్రయాణికులంతా మరణించి ఉంటారని ఈ సంస్థలు అంచనా వేశాయి. సముద్ర జలాల్లో తరచూ వందలాది మంది శరణార్థులు వలసల కోసం ఈ తరహా ప్రమాదకర పడవ ప్రయాణాలు సాగిస్తూ..తమ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.