ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్ర రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షం విదియ తిధి రోజు జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు తమ ప్రత్యేక రథాలపై ఊరేగింపుగా గుండిచా ఆలయానికి వెళ్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో స్వామివారు తన జన్మస్థానాన్ని పోలిన గుండిచా ఆలయంకు చేరుకోని విశ్రాంతి తీసుకుంటారు. పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర కళ్లారా వీక్షించిన వారికి అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలం లభిస్తుందని, పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారని విశ్వాసం. జగన్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యాత్మికతతో సమైక్యతా సూత్రానికి ప్రతీకగా నిలుస్తుంది.
రథయాత్ర కోసం బలభద్రుడి రథం తాళ ధ్వజం(14 చక్రాలు), దేవి సుభద్ర రథం దర్పదళనం(12 చక్రాలు), జగన్నాథుడి రథం నందిఘోష(16 చక్రాలు)లను సర్వాంగ సుందరంగా అలకరించారు. ఈ రథాల తాళ్లు లాగడం వల్ల సకల పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. తొమ్మిది రోజుల తర్వాత స్వామివారు గుడించా నుంచి తిరిగి బహుడా యాత్ర ద్వారా శ్రీమందిరానికి (ప్రధాన ఆలయం)చేరుకుంటారు. పూరీ క్షేత్రంలో జగన్నాథుని స్వామి ఆలయంలోని విగ్రహాలు రాతితో కాకుండా వేప చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం పాత విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ సందర్భంగా తొలగించిన పాత విగ్రహాలను జ్యోతిష్య, గ్రహగతులను అనుసరిస్తూ ఖననం చేస్తారు. పాత విగ్రహాలను తొలగించే సమయంలో ఆ విగ్రహాల నుంచి నాభి భాగాన్ని మాత్రం వేరు చేసి కొత్త విగ్రహాలకు అమరుస్తారు.
ఒడిశాలోని యాత్ర దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం 13 వేల మంది పోలీసులు, 19 మంది ఐపీఎస్ అధికారులు, 473 సీసీటీవీలతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రథయాత్ర కోసం దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు చేశాయి.