• Telugu News
  • /National

వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వద్దనుకున్నవారు ప్యూర్‌ పెట్రోల్‌ కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. అయితే.. అధిక ధర చెల్లించాల్సి వస్తుందని మెలిక పెట్టారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ కారణంగా వాహనాలు పాడవుతున్నట్టు ఫిర్యాదులు రావడం లేదని చెప్పారు.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Edited by: విధాత భారత్ డెస్క్ | Jul 15, 2026, 8:20 pm IST
Read Time: 7 mins
వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి

హైలైట్స్:

  • కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మెలిక
  • దేశంలో ఇథనాల్ పెట్రోల్ చిచ్చు

విధాత, హైదరాబాద్:
ఇథనాల్ పెట్రోల్‌పై ఈ మధ్య ఎక్కువగా చర్చ నడుస్తోంది. బండ్ల ఇంజిన్లు పాడవుతున్నాయని, వినియోగానికి అనుగుణంగా లేవనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు ఆయన రవాణా శాఖ మంత్రా? పెట్రోలియం మంత్రా? అనే సందేహాలు సైతం లేవనెత్తుతున్నారు. ఇథనాల్ లేని పెట్రోల్ కొనుగోలు చేయాలనుకునే వాహనదారులు అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ స్పష్టం చేయడం వివాదాస్పదమవుతోంది. కేంద్రం ప్రారంభించిన ఈ20 పెట్రోల్ బాగుందంటూ ఆయన సమర్థించుకున్నారు. ఈ20 పెట్రోల్ వినియోగం మూలంగా వాహనాలు చెడిపోతాయని, పాడవుతాయనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌పై ఇంత వరకు ఫిర్యాదులు రాలేదని, ఇంజిన్లు చెడిపోతున్నాయని కూడా ఎవరూ తమతో చెప్పడం లేదన్నారు. బంకులలో ఈ10 తో పాటు ఈ20 పెట్రోల్ కూడా విరివిగా లభ్యమవుతున్నదన్నారు.

వందశాతం పెట్రోల్‌ కూడా కొనొచ్చు కానీ..

దేశంలోని బంకులలో ఈ20 పెట్రోల్ వద్దని అనుకునే వారు, వంద శాతం పెట్రోల్ ను కొనుగోలు చేయవచ్చని, అయితే అదనంగా ధర చెల్లించాల్సి ఉంటుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కొన్ని బంకులలో ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాల కోసం ఈ85 పెట్రోల్ కూడా విక్రయిస్తున్నారన్నారు. ఆర డజనుకు పైగా వాహన కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయని, వీటిని త్వరలో మార్కెట్ లోకి విడుదల చేస్తారన్నారు. ఈ20 పెట్రోల్ తో నడిచే వాహనాలతో పోల్చితే ఈ80 పెట్రోల్ వాహనాల ధరలు చౌకగా ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో ఇథానాల్ తో కూడిన పెట్రోల్ పై అసంపూర్తి సమాచారం తో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో లేనిపోని కారణాలు చూపుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ10 తో నడిచే వాహనాల్లో ఈ20 పెట్రోల్ కూడా వినియోగించవచ్చని, ఎలాంటి సమస్యలు రావని ఆయన భరోసా ఇచ్చారు. ఈ20 వినియోగించడం మూలంగా తన వాహనం పాడయిందని ఒక్క వాహన యజమాని కూడా తమకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ వాహనాలపై మారుతి సుజుకీ కంపెనీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిందని, వాహనానికి గ్యారెంటీ కూడా ఇస్తోందన్నారు. మీ ప్రాంతం లేదా కార్యాలయంలో ఎవరైనా ఇథనాల్ తో కూడిన పెట్రోల్ వాడిన తరువాత ఏమైనా సమస్యలు వచ్చాయని చెబుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని తన మంత్రిత్వ శాఖలోని కార్యాలయం కూడా ఆరా తీసానని, ఏమైనా ఫిర్యాదులు వచ్చాయని అడగ్గా… రాలేదని సంబంధిత అధికారులు సమాధానమిచ్చారని గడ్కరీ గుర్తు చేశారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతే ఈ20 పెట్రోల్ ను వినియోగం లోకి తెచ్చామని, హైవేలపై నడిపిన సందర్భంలో మైలేజీ తక్కువగా వస్తుందన్నారు.

నా కుమారుడి కంపెనీకి కొంచమే లాభం..

పెట్రోల్ లో ఇథనాల్ ను కలపడం మూలంగా తన కుమారుడి కంపెనీ లాభపడుతుందనే విమర్శలను నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. పెట్రోలియం కంపెనీలు సేకరించే ఇథనాల్ లో తన కుమారుడికి చెందిన కంపెనీ కేవలం 0.5 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నదని, మిగతాది ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారన్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఇథనాల్ ను కలపడం ప్రారంభమై, ఆ తరువాత వచ్చిన యూపిఏ హయాంలో అమలైందని, తమ ప్రభుత్వ హయాంలో ఇథనాల్ శాతాన్ని 10 నుంచి 20 శాతం పెంచామన్నారు. ఈ విధానం అమలు చేయడం మూలంగా కాలుష్య నియంత్రణ తో పాటు విదేశీ మారకద్రవ్య భారం తగ్గుతుందన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, థాయ్ లాండ్ వంటి దేశాలలో ఇథనాల్, బయో ఫ్యూయల్ వినియోగిస్తున్నారన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే రైతులకు ఆదాయం పెరుగుతుందని, విదేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు తగ్గుతుందని, ఫలితంగా ప్రజలపై భారం తగ్గుముఖం పడుతుందన్నారు.