Maruti Suzuki Wagon R Flex Fuel | భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకీ కీలక ముందడుగు వేసింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే తొలి ప్యాసింజర్ కారును ఆవిష్కరించింది. Wagon R Flex Fuel మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మోడల్‌ను ఆవిష్కరించారు.
ఇప్పటికే రెండు సందర్భాల్లో ప్రొటోటైప్ మోడళ్లను ప్రదర్శించి మారుతి సుజుకీ ఇప్పుడు పూర్తిస్థాయి ఉత్పత్తి వాహనాన్ని ఆవిష్కరించడం విశేషం. పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, రవాణా రంగంలో జీవ ఇంధనాల వాడకాన్ని విస్తృతం చేయాలనే భారత లక్ష్యాలకు అనుగుణంగా ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ వాహనం కమర్షియల్ సెక్టార్‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా కంపెనీ తెలపింది. కానీ ధరకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటించలేదు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి?
ప్రస్తుతం భారత మార్కెట్‌లో E20 పెట్రోల్ వినియోగంలో ఉంది. అంటే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే 100 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం మాత్రమే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం అనేది E 20 నుంచి మొదలు E100 వరకు గల వివిధ ఇథనాల్ మిశ్రమాలతో నడిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ తరహాలో భారత్‌లో రూపొందించిన మొట్టమొదటి ప్యాసింజర్ కారు ఇదే కావడం గమనార్హం.
E100 వినియోగానికి ఇంజిన్‌లో మార్పులు
వాగన్ ఆర్ ఫ్లెక్సీ ఫ్యూల్ వాహనంలో మారుతి సుజుకీ ఇప్పటికే వినియోగిస్తున్న K12N 1.2 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. అయితే ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా పలు మార్పులు చేసింది. కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, అప్‌గ్రేడ్ చేసిన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ లైన్లు, రీకాలిబ్రేట్ చేసిన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అలాగే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని గుర్తించే ప్రత్యేక సెన్సార్‌ను ఇందులో అమర్చారు. దీంతో వాహనం ఆటోమేటిక్‌గా ఇంధన మిశ్రమాన్ని గుర్తించి పనితీరును సర్దుబాటు చేసుకుంది. అయితే ఈ మోడల్‌కు సంబంధించిన పవర్ అవుట్‌పుట్, మైలేజీ వంటి సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు.
📍 New Delhi
Launched India’s Flex-Fuel Car by Maruti Suzuki in New Delhi along with Union Minister Shri @HardeepSPuri Ji.
Congratulations to the entire team on this remarkable and forward-looking achievement. This milestone reinforces the vision of Prime Minister Shri… pic.twitter.com/r6UgSURqFM
— Nitin Gadkari (@nitin_gadkari) June 4, 2026
పాత కార్లను E100 ఇంధనంతో వాడలేమా?
ప్రస్తుతం భారత్‌లో ఉన్న E20తో పోలిస్తే E100 ఇంధనానికి ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. ఇది పెట్రోల్ కంటే ఎక్కువ తేమను గ్రహించే స్వభావం కలిగి ఉంటుంది. దీంతో ఇంజిన్ లోపలి భాగాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇథనాల్ స్వభావం కారణంగా ప్రత్యేక ఇంజిన్ భాగాలు అవసరమవుతాయి. ఇంధన పైపులు, ఇంజెక్టర్లు, సీల్స్, అంతర్గత ఇంజిన్ భాగాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకీ ముందడుగు వేసి.. ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్లను అభివృద్ది చేసింది.
భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై ప్రయోగాలు కొత్తేమీ కాదు. గతంలో టయోటా సంస్థ కొరోల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును 2022లో ప్రదర్శించింది. అనంతరం 2024లో ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను కూడా డిస్‌ప్లే చేసింది. టాటా మోటార్స్ కూడా భారత్ మొబిలిటీ షో 2024లో పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. అయితే ఉత్పత్తి దశకు చేరుకున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాన్ని ప్రదర్శించిన తొలి కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకీ నిలిచింది.
ఇంధన స్టేషన్లపై దృష్టి
ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. E85 కోసం ప్రత్యేక నిల్వ సదుపాయాలు, డిస్పెన్సింగ్ యూనిట్లు అవసరం. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక ప్రకటనల చేశారు. 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5వేల E85 ఇంధన పంపులను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ముందుగా ఢిల్లీ – ఎన్‌సీఆర్, ముంబై-పుణె-నాగ్‌పూర్ కారిడార్లలో 50 నుంచి 100 ఇంధన స్టేషన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 500 స్టేషన్లు, ఆ తర్వాత ప్రధాన నగరాల్లో వేల సంఖ్యలో పంపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.