కొలకతా హైకోర్టు తీర్పు పై అప్పీల్ వాపస్
అంగీకరించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం తీర్మానం
ముస్లిం రిజర్వేషన్లపై కొలకతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గతంలో మమతా బెనర్జీ సర్కార్ దాఖలు చేసిన అప్పీల్ ను ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహన త్రిసభ్య ధర్మాసనం అప్పీల్ ఉపసంహరణకు అనుమతించింది. పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లపై కొలకతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వేసిన అప్పీల్ ను వెనక్కి తీసుకోవడానికి మంత్రి మండలిలో తీర్మానం చేసిందని, గత మమతా బెనర్జీ ప్రభుత్వం అప్పీల్ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి తెలియచేశారు. ప్రభుత్వం తో పాటుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ కూడా తన అప్పీల్ ను కూడా ఉపసంహరించుకుంటున్నదని సుప్రీంకోర్టుకు ఆయన వివరించారు.
పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్కార్ 2010 నుంచి 2022 మధ్య 77 వర్గాలకు ఓబీసీ హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 77 వర్గాలలో 75 ముస్లిం వర్గాలు కాగా రెండు మాత్రమే ఇతర కులాలకు చెందిన వారు ఉన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని, బీసీ రిజర్వేషన్ల లక్ష్యానికి తూట్లు పొడిస్తున్నారంటూ కొలకతా హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ల పై విచారించిన జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంత బెంచి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని తీవ్రంగా ఆక్షేపించింది. నూతనంగా చేర్చిన వర్గాలకు 2010 సంవత్సరం తరువాత జారీ అయిన 12 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్ధు చేస్తున్లు తీర్పు ఇచ్చింది. మమతా బెనర్జీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఓబీసీ లలో 113 ఉప కులాలు ఉండగా, అందులో 77 ముస్లిం వర్గాలు కాగా, 33 మంది ముస్లిం యేతర హిందూ కులాలు ఉన్నాయి. 2010 కు ముందు ఓబీసీలలో ఉన్న కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని, మమతా బెనర్జీ సర్కార్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ ఉత్తర్వులను రద్ధు చేస్తూ హైకోర్టు 2024 మే నెలలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ దశలో ఉండగా బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి రద్ధు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ సర్కార్ జారీ చేసిన మతపరమైన రిజర్వేషన్ల ఉత్తర్వులను రద్ధు చేసేందుకు జూన్, 2026 లో బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేసింది. కొలకతా హైకోర్టు తీర్పు ప్రకారం ఓబీసీల జాబితా నుంచి ముస్లిం వర్గాలను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఉన్న 66 కులాలను మాత్రమే ఓబీసీ జాబితాలో కొనసాగించనున్నట్లు సభాముఖంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. మతపరమైన రిజర్వేషన్లు సరికావని గతంలో కొలకతా హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, ఓబీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి సువేంధు అధికారి సభ్యులకు తెలియచేశారు. ఈ 66 కులాల్లో ముస్లింలకు చెందిన మూడు వర్గాలు ఉన్నాయని, వారికి గతంలో మాదిరి రిజర్వేషన్ కొనసాగుతుందని రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో ఏ విభాగం కింద అత్యంత వెనకబడిన వారికి 10 శాతం, వెనకబడిన వారికి 7 శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు పరుస్తున్నారు.