తమిళనాడు సీఎం, హీరో విజయ్ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘పోరాటం ఎంత కఠినంగా ఉంటే.. విజయం అంత ఘనంగా ఉంటుంది. జులై 23న జననాయగన్ వచ్చేస్తున్నాడు’ అని ‘ఎక్స్’లో చిత్ర బృందం పోస్ట్ చేసింది. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్‌లో పోస్టర్ షేర్ చేశారు. తమ అభిమాన హీరో జన నాయగన్ విడుదల తేదీ వెల్లడితో విజయ్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హెచ్.వినోద్ దర్శకత్వంలో ముస్తాబైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రేమలు మూవీ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది.
రాజకీయాల్లోకి రాకముందు టీవీకే అధినేత, సీఎం విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రాజకీయ పరమైన వివాదాలు..సెన్సార్ సమస్యల కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు కేసులు, విచారణలు, సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) పునః పరిశీలన తర్వాత ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. దాదాపు 183 నిమిషాల నిడివితో ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.