హర్మూజ్ జలసంధిపై పట్టుకోసం అమెరికా-ఇరాన్ ల మధ్య పరస్పర దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ ఓడరేవులపై దిగ్బంధనాన్ని(బ్లాకేడ్) తిరిగి విధించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో 20కిపైగా యుద్ధనౌకలు, వందలాది సైనిక విమానాలను మోహరించినట్లు వెల్లడించింది. అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రకటనతో అప్రమత్తమైన ఇరాన్ మిలటరీ.. అమెరికా నౌకాదళం రూట్ బ్లాక్ చేసేలోపే తమ ఆయిల్ ట్యాంకర్లను, కార్గో షిప్పులను సముద్ర మార్గం ద్వారా సరిహద్దులు దాటించడం చేపట్టింది. తమ ఆయిల్ ఎగుమతులను ఆపాలని చూస్తే.. మిగతా ఏ దేశం కూడా ఇక్కడి నుంచి ఒక్క బొట్టు ఆయిల్ కూడా
సేఫ్‌గా పంపలేదని ఇరాన్ హెచ్చరించింది.
పీస్ డీల్ క్యాన్సల్
అమెరికా నేవీ బ్లాకేడ్ అమలు నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. రెండు దేశాల మధ్య వరుస దాడులతో కార్గో షిప్పుల ట్రాన్స్‌పోర్ట్ స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్లాకేడ్ అమలు నిర్ణయంతో అమెరికా శాంతి ఒప్పందాన్ని ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇకపై తమకు ఎలాంటి డీల్ అవసరం లేదని, తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము వైదొలుతున్నామని ప్రకటించింది. అమెరికా వైఖరీ ఇలాగే కొనసాగితే మునుముందు తీశ్ర పరిణామాలు తప్పవని, గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరించింది.
గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు అడ్డుకుంటాం
పశ్చిమాసియాలో చమురు ఎగుమతులు చేస్తే అన్ని దేశాలు కలిసే చేయాలని.. లేదంటే ఎవరూ చేయకూడదని ఇరాన్ స్పష్టం చేసింది. బహ్రెయిన్ లోని యూఎస్ నేవీ స్థావరంపై ఐఆర్‌జీసీ దాడులు చేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమను కాదని ముందుకు వెళ్తే.. అమెరికా మిత్రదేశాల చమురు, గ్యాస్ ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా దాడులు చేస్తామని, పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతుల మొత్తాన్ని ఆపుతామని హెచ్చరించింది.హర్మూజ్ జలసంధి రవాణా ఆంక్షలతో అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర ఆటంకాలు ఏర్పడి మరోసారి గ్లోబల్ ఎకానమీకే పెనుముప్పు ఎదురుకానుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.