ఏపీలో ముద్రగడ మరణంపై రాజకీయ సెగలు !

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఏపీలో రాజకీయ వివాదం చెలరేగింది. అధికార లాంఛనాలు, కుటుంబ పరిణామాలు, అధికార-ప్రతిపక్ష విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jul 15, 2026, 12:52 pm IST
Read Time: 6 mins
ఏపీలో ముద్రగడ మరణంపై రాజకీయ సెగలు !

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(73) మరణంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ సెగలు రేగాయి. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే జనసేనలో చేరి తనను అందరి కంటే ఎక్కువ మానసిక క్షోభకు గురిచేసిందని, తాను చనిపోతే తన అంత్యక్రియలకు కూడా రావొద్దని ముద్రగడ చెప్పిన సంగతి గుర్తు చేస్తూ “గో బ్యాక్ క్రాంతి” అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు చేశారు.

తండ్రికి కడసారి నివాళులు అర్పించేందుకు తనకు అనుమతించాలని క్రాంతి చేసిన విజ్ఞప్తితో ముద్రగడకు నివాళులు అర్పించేందుకు పోలీసులు ఆమెను అనుమతి ఇచ్చారు. పోలీసు బందోబస్తు నడుమ కిర్లంపూడికి వచ్చిన క్రాంతి తన తండ్రి ముద్రగడ భౌతిక కాయాన్ని చూసేందుకు రాగా…ఆమె తల్లి సైతం అందుకు నిరాకరించి మృతదేహాన్ని కూతురిని తాకనివ్వలేదు. దీంతో భౌతికకాయం వద్దకు రానీయకపోవడంతో దూరం నుంచే తండ్రిని చివరిచూపు చూసి క్రాంతి కన్నీటితో వెళ్లిపోయారు.

అధికార లాంఛనాలపై పరస్పర విమర్శలు

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంఅంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి.. సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలందించారని.. అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముద్రగడ మరణం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ తమ తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు.

మంత్రుల నివాళి

ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ జిల్లా కిర్లంపూడికి వెళ్లిన మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరపున ముద్రగడ నివాసంలో ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సంద్బంగా ముద్రగడ మరణాన్ని మేం రాజకీయం చేయదలుచుకోలేదని, మాజీ ప్రజ్రాప్రతినిధులకు ప్రోటో కాల్ మేరకు దక్కాల్సిన గౌరవం మేరకు ముద్రగడ అంత్యక్రియాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిపై కూడా వైసీపీ రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు.

అయితే బతికినన్ని రోజులు ముద్రగడను వేధించిన కూటమి పార్టీలు…ఆయన చనిపోయాక అధికారిక లాంఛనాల పేరుతో మొసలి కన్నీరు కారుస్తుందంటూ వైసీపీ నేత జక్కంపూడి రాజా విమర్శించారు. ముద్రగడ ఏ రోజు అధికారం కోసం ప్రాకులాడలేదని, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని కుటుంబ సభ్యులు సైతం చెప్పారని వెల్లడించారు.