పనస కలపకు కరవు..మూగబోయిన బొబ్బిలి వీణ!

పనస కలప కొరతతో ప్రపంచ ప్రఖ్యాత బొబ్బిలి వీణ తయారీ తీవ్ర సంక్షోభంలో పడింది. జీఐ గుర్తింపు పొందిన ఈ అరుదైన హస్తకళను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుతున్నారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jul 07, 2026, 2:42 pm IST
Read Time: 8 mins
పనస కలపకు కరవు..మూగబోయిన బొబ్బిలి వీణ!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి వీణలు మూగబోతున్నాయి. శతాబ్దాల అరుదైన హస్తకళా ప్రతీకగా జీఐ(GI) గుర్తింపుతో దేశ విదేశాల ఆదరణ సాధించిన బొబ్బలి వీణ తయారీకి అవసరమైన పనస కలప దొరకక..ఆ వీణ స్వరాలు పలకని దుస్థితి ఎదురవుతుంది.300ఏళ్లకు పైగా చరిత్రాక నేపథ్యం కల్గిన బొబ్బలి వీణ తయారీ హస్తకళను నమ్ముకున్న కళాకరులు..పనస కలప కొరతతో వీణల తయారీ చేయలేని నిస్సాహాయ పరిస్థితిలో పడిపోయారు. అవసరమైన పనస మొక్కలు పెరిగితేనే బొబ్బిలి వీణ స్వరాలు పలుకుతానంటుంది.

తరాలుగా వారికి వీణల తయారీనే జీవనోపాధి మార్గం

బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ గ్రామాలు బొబ్బిలి వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ అరుదైన హస్తకళా వీణల తయారీతో మనుగడ సాగిస్తున్నారు. వీటి తయారీకి పనస, సంపంగి కలప చెక్కను ఉపయోగిస్తారు. అయితే బొబ్బిలి వీణలకు అంతర్జాతీయంగా అంత క్రేజ్ ఉండటానికి కారణం అది ఏకఖండ వీణ కావడం. అంటే ఎక్కడా అతుకులు లేకుండా ఒకే పనస మొద్దును తొలిచి ఈ వీణను తయారు చేస్తారు. పనస కలపకు శబ్దాన్ని ప్రకంపించే గుణం అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ కలప తేలికగా ఉండి, వాతావరణ మార్పులకు త్వరగా పాడవదంటారు. వందేళ్లయినా వీణ చెక్కుచెదరకుండా ఉండాలంటే పనస కలపతోనే వీణలను తయారీ చేయాలని స్థానికుల విశ్వాసం. కానీ ఇప్పుడు ఆ పనస కలప దొరకడమే గగనమైపోయింది.

బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు

బొబ్బిలి వీణగా గుర్తింపు పొందిన బొబ్బిలి హస్తకళా అరుదైన ఉత్పత్తియైన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణలను కూడా బహుమతి(గిఫ్టు ఆర్టికల్)గా, జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్‌ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. కేంద్రం నుంచి 2011లో ప్రత్యేక జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI)గుర్తింపు, వన్‌ డిస్ట్రిక్ట్ వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) అవార్డు కూడా బొబ్బిలి వీణకు దక్కడం విశేషం.

ప్రభుత్వ విభాగాల ద్వారానే ఆర్డర్లు

ప్రభుత్వం ఆధ్వర్యంలోని లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్ విభాగం ద్వారా వీణ తయారీకి ఆర్డర్లు వస్తున్నాయని, ఒక్కో వీణ సైజు ఆధారంగా వారికి కూలి చెల్లింపులు జరుగుతున్నాయని కార్మికులు తెలిపారు. తొమ్మిది ఇంచుల వీణకు రూ. 1,340, 13 ఇంచుల వీణకు రూ.2,160, 17 ఇంచుల వీణకు రూ.2,500, రెండు అడుగుల వీణకు రూ.4,185 వరకు కార్మికులకు చెల్లిస్తారు. అయితే ఒక్క చిన్న గిఫ్ట్ సైజు వీణను తయారు చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుండగా, పెద్ద మ్యూజికల్ వీణ అయిన 53 ఇంచుల వీణ తయారు చేయడానికి 22 నుంచి 30 రోజులు పట్టుతుందని కార్మికులు వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో తగ్గిన పనస కలపతో వీణల తయారీకి ఆటంకాలు

బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన కలపకు అవసరమైన పనస తోటలు ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉండేవి. కానీ కాలక్రమేణా రైతులు పనస తోటలను నరికేసి, ఎక్కువ లాభాలనిచ్చే జీడిమామిడి, యూకలిప్టస్ తోటల వైపు మొగ్గు చూపారు. అది ఇప్పుడు బొబ్బిలి వీణల తయారీకి ఆటంకంగా మారిపోయింది. పనస కలప దొరకక పెద్ద వీణల తయారీ తగ్గడంతో, చాలామంది కళాకారులు ఉపాధి కోసం గిఫ్ట్ ఆర్టికల్స్ గా ఇచ్చే మినీ వీణల తయారీకే పరిమితమవుతున్నారు. మరికొందరు ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన ఏపీ ప్రభుత్వం పనస కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ఇటీవలే నిర్ణయించింది.

ఆర్డర్లు ఉన్నా…కలప లేక ఖాళీగా కళాకారులు

అంతవరకు వీణ తయారీ కళాకారులకు కలప కొరత లేకుండా పనస కలప దిగుమతి కోసం ప్రభుత్వం నుంచి బొబ్బిలి వీణ కళాకారుల కోసం రూ. 5 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులతో సుమారు మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు రెండున్నర లక్షల విలువైన పనస కలపను కొనుగోలు చేసి బొబ్బిలి వీణల కేంద్రం సమీపంలో నిల్వ ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఆ కలపను కళాకారులకు పంపిణీ చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్డర్లు వస్తున్నందునా…ప్రభుత్వం కలప అందిస్తే వీణల తయారీ కొనసాగిస్తామని..తద్వారా మాకు జీవనోపాధికి ఊరట లభిస్తుందని బొబ్బలి వీణ కళాకారులు కోరుతున్నారు.