• Telugu News
  • /National

అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి విధించిన ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 07, 2026, 1:12 pm IST
Read Time: 7 mins
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పేలుళ్ల ఘటన కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అహ్మదాబాద్ నగరంలో 2008 జులై 26న జరిగిన వరుస పేలుళ్లలో 56 మంది మృతి చెందారు. 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తులో 100 మందిని నిందితులుగా పేర్కొని, 78 మందిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసులో ఇండియన్ ముజాహిదీన్, సిమి వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన సఫ్దర్ నాగోరి, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది కీలక దోషులుగా ఉన్నారు. వీరందరిపైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస చట్టం, దేశద్రోహం లాంటి అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేశ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ఈ ఉగ్రవాద దాడి కేసులో కింది కోర్టు (స్పెషల్ కోర్టు) ఇచ్చిన మరణశిక్ష తీర్పును గుజరాత్ హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదును విధించింది. గుజరాత్ హైకోర్టు తీర్పు న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చింది.

2008 జూలై 26న గుజరాత్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మొదటి విడత పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు రెండో విడత బాంబులు పేల్చడం గమనార్హం.పేలుళ్ల ఘటనలో 56 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలపాలై దివ్యాంగులుగా మారారు. ఈ కేసును లోతుగా విచారించిన అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం (స్పెషల్ కోర్టు) దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత, ఫిబ్రవరి నెలలో కీలక తీర్పును ఇచ్చింది. మొత్తం 78 మంది నిందితులను విచారించగా అందులో 49 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఏ.ఆర్. పటేల్, వారిలో 38 మందికి మరణశిక్ష (ఉరిశిక్ష), మరో 11 మందికి జీవితకాల (యావజ్జీవ) కారాగార శిక్ష విధించారు. ఒకే కేసులోఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం అని లాబీట్ తెలిపింది.

అయితే భారతీయ న్యాయ వ్యవస్థ నియమాల ప్రకారం, కింది కోర్టు లేదా సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షను నేరుగా అమలు చేయడానికి వీలులేకపోవడం…ఆ శిక్షను సంబంధిత రాష్ట్ర హైకోర్టు ధృవీకరించాల్సి (కన్ఫర్మేషన్) ఉండటం అనివార్యమైంది. దీంతో దోషులకు పడిన ఉరిశిక్షను ఆమోదించాలని.. రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. అటు దోషులుగా ప్రకటించిన 49మంది కూడా తమకు విధించిన మరణశిక్ష, యావజ్జీవ శిక్షలను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. వేల పేజీలతో కూడిన స్పెషల్ కోర్టు తీర్పును పరిశీలించేందుకు.. జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. గత రెండున్నరేళ్లుగా ఈ ధర్మాసనం దాదాపు 248 సార్లు నిరంతరంగా విచారణ కొనసాగించింది. చివరకు కింది కోర్టు దోషులకు విధించిన శిక్షను ఆమోదిస్తూ తీర్పు వెలువరించింది.

తీర్పుతో పాటు బాధితులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.5 లక్షలు,సాధారణంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఈ నష్టపరిహార ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31, 2027 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం గడువు విధించింది.