సముద్రంలో మత్స్యకారులకు చేపల వేటలో రకరకాల చేపలు, ఇతర ప్రాణులు వలలకు చిక్కుతుంటాయి. వాటిలో కొన్ని ప్రాణాంతక చేపలు, పాము జాతులు ఉన్నప్పుడు మత్స్యకారుల ప్రాణాలకు ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతుంటాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో ఒక ఇసుక బీచ్‌లో, పసుపు రంగు రెక్కలున్న ముదురు రంగు అండాకారపు చేప వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ చేప తన తోక భాగానికి ముందు శరీరానికి రెండు వైపులు విషపు ముల్లులు కలిగి ఉంది. సాధారణ చేపనే కదా అని ఆ చేపను తోక భాగంలో పట్టుకుంటే ఆ విషపు ముల్లు కుచ్చుకుని నిమిషాల్లో తీవ్ర అస్వస్థతకు గురవుతారని మత్స్యకారులు చెబుతున్నారు. తన వలలో చిక్కిన ప్రమాదకర విషపు ముల్లు చేప వీడియోను తాజాగా ఉత్తరాంధ్ర జాలరీ ప్రదర్శించగా..అది వైరల్ గా మారింది.
విషపు ముల్లుల చేపలను ట్రిగ్గర్‌ఫిష్ జాతికి చెందినవనిగా నిపుణులు వెల్లడిస్తున్నారు. ట్రిగ్గర్ ఫిష్ లు బాలిస్టిడే కుటుంబానికి చెందిన ప్రత్యేకమైన సముద్ర చేపల జాతి అని, ఈ చేపల వెన్నుభాగంలో ఉండే ముల్లులు తుపాకీ ట్రిగ్గర్ లాగా పనిచేయడం వల్ల వీటికి ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు. ట్రిగ్గర్ చేప శరీరం దిగువ భాగంలో రెండు వైపుల ముల్లులు ఉంటాయి. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మొదటి పెద్ద ముల్లు నిటారుగా లేస్తుంది. రెండవ చిన్న ముల్లు మొదటి ముల్లును గట్టిగా లాక్ చేస్తుంది. దీనివల్ల శత్రువులు ఆ ముల్లును కిందకి నొక్కలేరు. చేప స్వయంగా రెండవ ముల్లును (ట్రిగ్గర్) నొక్కినప్పుడు మాత్రమే మొదటి ముల్లు కిందకు వంగుతుంది. అందుకే వీటిని ట్రిగ్గర్ ఫిష్ లు అంటారు. వీటి బలమైన దవడలు, మనుషుల తరహా దంతాలతో ఇవి చేసే దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ట్రిగ్గర్ ఫిష్ గుడ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లిన శత్రువులపై అవి దూకుడుగా దాడి చేస్తాయి. స్కూబా డైవర్లు, ఈతగాళ్లు ఈ చేపలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తుంటారు. ఎక్కువగా ట్రిగ్గర్ ఫిష్ జాతి చేపలు ఉపఉష్ణమండల మహాసముద్రాలలో నివసిస్తుంటాయి.
డేంజర్ ఫిష్ అంటూ మత్స్యకారుడి వీడియో వైరల్#DangerFish pic.twitter.com/fjiGfu0SjX
— UttarandhraNow (@UttarandhraNow) July 6, 2026