మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమని.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, పిటిషన్ కు విచారణార్హత లేదంటూ పిటిషన్ ను కొట్టివేసింది.
మీనాక్షి నటరాజన్ తరపును సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని కోర్టుకు నివేదించారు. తన క్లయింట్ నామినేషన్ అఫిడవిట్ లో అన్ని వివరాలు వెల్లడించారని, తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ప్రైవేటు కేసును చూపి ఆర్వో నామినేషన్ తిరస్కరించడం అన్యాయమని వాదించారు. ప్రైవేట్ ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, పైగా ఆమెపై(మీనాక్షి) నమోదైందని చెబుతున్న కేసులో ఇప్పటివరకు చార్జీలు నమోదు కాలేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం నామినేషన్ తిరస్కరణకు చార్జీలు ఫ్రేమ్ కావడం తప్పనిసరి. కోర్టు కేవలం ఆమెకు నోటీసులు మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఆమె నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్ధం అని వాదించారు.
అయితే అయితే నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో జోక్యం చేసుకున్న తీర్పులు ఉంటే చూపించాలన్నారు. నామినేషన్ తిరస్కరిస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది.
మధ్యప్రదేశ్ తరఫున రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఓ కేసు వివరాలను వెల్లడించలేదన్న కారణంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో ఆమె గురువారం అత్యవసరంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన నామినేషన్ రిజక్ట్ కావడంతో.. ఎన్నికల ఫలితాలపై స్టే విధించాలని, ఈ వ్యవహారంలో తక్షణ ఊరట ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి మూడు స్థానాలకుగానూ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇకముందు ఈ వివాదంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు సూచించినట్లుగా హైకోర్టుకు వెలుతారా లేక కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి ఆశ్రయిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.