ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లేందుకు నా తల్లి అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రజలు కోరుకుంటేనే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కాదంటే మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో తన రాజకీయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తానో త్వరలో వెల్లడిస్తానన్నారు. భగవద్గీతలోని ‘సత్కర్మలు చేయి, ఫలితాన్ని ఆశించకు’ అనే సూక్తితో తన ప్రసంగాన్ని ప్రారంభించిన లారెన్స్, ఒక చిన్న కథ ద్వారా నిఖార్సయిన కష్టానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని వివరించారు.

నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు అని, తనకు రాజకీయ పదవుల మీద గానీ, డబ్బు సంపాదన మీద గానీ ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే నేడు, పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి చేర్చాయని స్పష్టం చేశారు. కేవలం అభిమానులు, ప్రజలు కోరుకుంటేనే వారి అభిప్రాయం మేరకు రాజకీయాల్లో అడుగుపెడతానని తెలిపారు. నేను రాజకీయాల్లోకి రావాలో వద్దో నా అభిమానలు, ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. నాకు మీ సలహా మరియు మార్గదర్శకత్వం అవసరం అని స్పష్టం చేశారు. లారెన్స్ ట్వీట్ మేరకు అభిమానులు తమకు తోచిన సలహాలను ఇవ్వడం ప్రారంభించారు.

తాను తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆలోచన రావడానికి, అసలు రాజకీయాల వైపు అడుగులు పడటానికి గల కారణాలను వీడియోలో రాఘవ లారెన్స్ గుర్తుచేసుకున్నారు. మొదట్లో తాను కేవలం సామాజిక సేవలు, పేదలకు సహాయం మాత్రమే చేసేవాడినని, అయితే జల్లికట్టు ఉద్యమం సమయంలో అక్కడి వారికి ఆహారం అందించినప్పటి నుంచే తన రాజకీయ ప్రయాణానికి పునాది పడిందని చెప్పారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సీమాన్ చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. తాను రజనీ వద్దకు వెళ్లి ఈ విషయం చెబితే, ఆయన ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పుడు తాను కూడా పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పానని, ఒకవేళ గెలిస్తే పెద్ద ఎత్తున చారిటబుల్ ట్రస్ట్‌లు నిర్మించి సేవ చేయవచ్చని తన అభిమానులు అన్నారని గుర్తుచేసుకున్నారు.

అయితే, తన రాజకీయ ఎంట్రీ గురించి తన తల్లికి చెప్పినప్పుడు ఆమె ముఖం మారిపోయిందని, రెండు మూడు రోజులు తనతో మాట్లాడటం మానేసి, రాజకీయం ఒక మురికికూపం అని వారించారని లారెన్స్ వెల్లడించారు. ఆ సమయంలోనే కరోనా రావడం, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడం జరిగాయని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నందుకు రజనీ ఎంతో బాధపడ్డారని ఆయన అన్నారు. ఆ తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించగానే, తన స్నేహితుడు వస్తున్నాడంటూ తాను ట్రస్ట్‌ సభ్యులతో కలిసి విజయ్ కోసం పని చేయడం ప్రారంభించానని చెప్పారు. విజయ్ ఎంతో కష్టపడే తత్వమున్న వ్యక్తి అని కొనియాడారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, విజయ్ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చాడని భావించిన తన తల్లి.. ఇప్పుడు తనను కూడా రాజకీయాల్లోకి వెళ్ళడానికి అనుమతించిందని లారెన్స్ చెప్పుకోచ్చాడు. అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతూనే, తనకు జన్మనిచ్చిన తల్లితో సమానంగా భావించే తన అభిమానుల అభిప్రాయం కూడా తనకు ముఖ్యమని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలా? అసలు తనకు ఆ అర్హత ఉందా? లేదా? అనే విషయాన్ని అభిమానులే సోషల్ మీడియా కామెంట్ల ద్వారా తెలియజేయాలని రాఘవ లారెన్స్ ఆ వీడియోలో కోరారు.

రాఘవ లారెన్స్‌ తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగులోనూ అటు డాన్స్ మాస్టర్ గా.. హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్స్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఆయన సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీయైన అసెంబ్లీ స్థానం తిరుచ్చి స్థానం నుంచి పోటీ చేస్తాడని భావిస్తున్నారు.