కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఊరట

తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాటలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు ఊరట కలిగింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 14, 2026, 1:32 pm IST
Read Time: 4 mins
కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఊరట

తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాటలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విజయ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు జూలై 27న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై విజయ్‌ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబాలకు ఊరట కలిగింది.

జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కే.వినోద్ చంద్రన్‌ల సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికుందని ధర్మాసనం ప్రశ్నిస్తూ.. కుటుంబంలో ఏకైక సభ్యుడు మరణిస్తే అతని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా? అని ప్రశ్నించింది.

గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్‌ కరూర్‌ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు.

దీనిపై దాఖలపై పిటిషన్లను విచారించిన మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16కు విరుద్ధమని, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నవారి హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నియామకాలు చేయలేమని పేర్కొంది. సీఎం విజయ్‌ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని డిమాండ్లకు దారితీస్తాయని హైకోర్టు అభిప్రాయపడుతూ నియామకాలపై స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై విజయ్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా…తాత్కాలికంగా ఊరట దక్కింది.