తమిళనాడులో మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో కీలక నిర్ణయం!

తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘వెట్రి పయణం’పై తమిళనాడు సీఎం విజయ్‌ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళలంతా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చనని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 24, 2026, 12:02 pm IST
Read Time: 4 mins
తమిళనాడులో  మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో కీలక నిర్ణయం!

విధాత, హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తూ తమిళనాడు సీఎం విజయ్‌ ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళలంతా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చనని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ‘వెట్రి పయణం’ పథకంలో సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంది. ఈ పథకం పరిధిని ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో విస్తరిస్తున్నట్లుగా విజయ్ తెలిపారు. మరోవైపు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు కూడా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయ్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఉచిత బస్సు పథకాన్ని ఆక్టోబర్ 2నుంచి అమలు చేయనుండగా..ప్రభుత్వంపై రూ. 6వేల కోట్ల భారం పడనుంది.

అలాగే పొంగల్‌ నుంచి ‘అన్నపూర్ణ సూపర్‌-6’ పథకం అమలు చేయనున్నట్టు సీఎం విజయ్‌ వెల్లడించారు. ఈ పథకం కింద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే ప్రతిపాదన గతంలో వెల్లడైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు ఎల్‌పీజీ సిలిండర్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది.

ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతీ నవజాత శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించే ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకాన్ని సెప్టెంబర్ 15, 2026న ప్రారంభించనున్నారు. మహిళలకు బస్సు ప్రయాణం విస్తరణ, కుటుంబాలకు వంటగ్యాస్‌ ప్రయోజనాలు వంటి పథకాలను విజయ్ ఒక్కొటిగా అమలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.