అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాలలో మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గురువారం ఒకేసారి 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 4,300 పెరిగి రూ. 1,59,270వద్దకు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,950 పెరిగి రూ. 1,46,000కు పెరిగింది. కిలో వెండి ధర కూడా ఒకేసారి రూ. 10,000 పెరిగి రూ.2,60,000 కు చేరింది.
మరింత పెరిగే అవకాశం..
అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని రీతిలో భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ ట్రేడింగ్.కామ్ సీఈఓ పీటర్ మెక్‌గైర్ అంచనా వేశారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4,600 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. రాబోయే ఆగస్టు నెలాఖరు నాటికి ఇది ఏకంగా 4,700 డాలర్ల మార్కుకు చేరుకోవచ్చని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెండి ధరలు కూడా అదే బాటలో భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువలో మార్పులు బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.