తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22ఏపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే స్వతంత్ర విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించాలని కోరారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను 22ఏ జాబితాలో పెట్టి వేధింపులకు గురి చేశారని, రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల దందా సాగుతుందని హరీశ్ రావు లేఖలో ఆరోపించారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని, 30% కమిషన్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరో తేల్చాలని రాహుల్ గాంధీని కోరారు. 22ఏ నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డోమైన్ లో పెట్టాలని, ఆరోపణలు నిజం కాకపోతే స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరారు.
యాదాద్రిలో 40 వేల ఎకరాలు 22ఏలో చేర్చారని, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టు భూములపై వివాదాలు సృష్టిస్తున్నారని ఈ వివాదంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 22ఏ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఎమ్మెల్యే హరీష్ రావు తన లేఖలో స్పష్టం చేశారు.