విధాత, హైదరాబాద్ :సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న అసమ్మతి అంశాలపై వారు చర్చిస్తున్నారు. ముఖ్యంగా కొండా సుస్మిత తనపై చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ వివరణ అంశంపై భట్టితో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అలాగే సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంశం..కొండాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, విప్ ల వ్యాఖ్యలు వ్యవహారంపై కూడా వారిద్దరూ చర్చించనున్నట్లుగా తెలుస్తుంది.
భట్టితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చారు. అలాగే పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కూడా రెండు వివరణ లేఖలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చినప్పటికి ఆయనను మంత్రి కొండా సురేఖ కలవలేదు. సురేఖ సోమవారం తన మంత్రిత్వశాఖలకు సంబంధించి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షలు నిర్వహించారు.