దూసుకపోతున్న బంగారం, వెండి ధరలు

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1210 పెరిగి రూ.1,60,480 వద్ద కొనసాగుతుండగా..క్యారెట్ల బంగారం ధర రూ.1110 పెరిగి రూ.1,47,100 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 పెరిగి రూ. 2,65,000కు చేరింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 21, 2026, 11:07 am IST
Read Time: 4 mins
దూసుకపోతున్న బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా జోరందుకున్నాయి.అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ద్రవ్యోల్బణం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేయడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి కూడా పసిడి బాటలోనే పైపైకి దూసుకపోతుంది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1210 పెరిగి రూ.1,60,480 వద్ద కొనసాగుతుండగా..క్యారెట్ల బంగారం ధర రూ.1110 పెరిగి రూ.1,47,100 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 పెరిగి రూ. 2,65,000కు చేరింది.

మరింత పెరుగనున్న పసిడి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటింది. పసిడి ధర పెరుగుదలపై రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా సూచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఉద్రిక్తతలు అని ఆయన చెప్పారు.

ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం, హోర్ముజ్‌ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచాయని తెలిపారు.పెట్టుబడి దారులు సాధారణంగా సురక్షితమైన పెట్టుబడి వైపు వెళ్తారని.. అందులో భాగంగానే పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని అంచనా వేశారు. దీంతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరుగుతోంది. వివాహాది శుభాకార్యాలు, పండుగ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనా మధ్య ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ధరల పెరుగుదలతో కొనుగోళ్లు తగ్గవచ్చని వరల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడుతుంది.