విధాత: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఓ బహిరంగ సభలో ఊహించని సంఘటన ఎదురైంది. ‘ఛాత్రోం కీ గూంజ్’(విద్యార్థుల ప్రతిధ్వని)కార్యక్రమంలో రాహుల్ గాంధీకి ఓ యువతి ముద్దు పెట్టిన వీడియో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని పూణేలో నిన్న రాత్రి నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం అనంతరం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు పోటీపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాహుల్ వెళ్లిపోతుండగా ఓ యువతి దగ్గరికొచ్చి చెంపపై ముద్దు పెట్టారు. దీంతో ఆయన ఒకింత అశ్చర్యపోతునే..నవ్వుతూ ఆమెను పలకరించారు. ఆమెతో మాట్లాడుతూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. రాహుల్ కు యువతి ముద్దు ఘటనతో పాటు, ఇదే వేదికగా ‘మనుస్మృతి’పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని రాజేశాయి.
యువతి ముద్దు వ్యవహారం రాహుల్ గాంధీ పట్ల యువతలో ఉన్న అభిమానానికి, ఆయన వారితో ఎంత సౌకర్యవంతంగా ఉంటారనడానికి నిదర్శనమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజకీయ నాయకులు హుందాగా గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ కు ముద్దు పెట్టిన 11వ తరగతి చదువుతున్న యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.
‘మనుస్మృతి మనస్తత్వం’ పాలన వ్యాఖ్యలపై దుమారం..
మరోవైపు పూణే సభలో రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ‘మనుస్మృతి మనస్తత్వం’ రాజ్యమేలుతోందని, మహిళలు పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన మహిళా నిరసనకారులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కేశవ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రాహుల్ పూణే ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం ఒక ‘రాజకీయ కామెడీ షో’ అని ఎద్దేవా చేశారు. కాలేజీ బస్సుల్లో విద్యార్థులను తరలించి, కృత్రిమంగా జనాన్ని సమీకరించారని ఆరోపించారు. మహిళల సమస్యలపై మాట్లాడే ఆ నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సభకు భారీగా యువత తరలిరావడాన్ని చూసి బీజేపీ నేతలు కంగారు పడుతున్నారని అన్నారు.
రాహుల్ గాంధీకి యువతి ముద్దు
పుణేలోని ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ యువతి చెంపపై ముద్దు పెట్టడం సంచలనంగా మారింది.#RahulGandhi #Pune #Congress pic.twitter.com/5sHIOEtC8Y
— citizenspulse (@citizenspulse01) August 24, 2026