• Telugu News
  • /National

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్టీఏకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 24, 2026, 2:17 pm IST
Read Time: 4 mins
నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్‌ లీక్‌ వివాదంలో తీసుకుంటున్న చర్యలపై ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎన్టీఏను ఆదేశించింది. ఆఫిడవిట్లు చూశాక తదుపరి నిర్ణయాలు వెల్లడిస్తామని పేర్కొంది. పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై ఆగ్రహం చేసింది. గత తప్పుల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు అవసరం ఉందని అభిప్రాయపడింది.
పరీక్షల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించింది. పేపర్ లీక్‌తో విద్యార్థులుతీవ్ర మనోవేదనకు గురయ్యారని వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణలో లోపాలకు పూర్తి జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేసింది. నీట్‌ పరీక్ష చుట్టూ చోటుచేసుకున్న తప్పిదాలకు కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి ఘటనలు ఇక మీదట కొనసాగకూడదని పేర్కొంది.

ప్రస్తుతం కొనసాగుతున్న నీట్ 2026 పేపర్ లీక్ తర్వాత చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను మేం దగ్గర్నుంచి సమీక్షించాలనుకుంటున్నాం. భవిష్యత్తులో నీట్‌ (NEET) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. మరి అందుకోసం మీరు ఎలాంటి మార్పులు చేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ, డేటా భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారా? ఇవన్నీ మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ సంస్కరణలకు సంబంధించి వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయండి అని సుప్రీంకోర్టు ఎన్టీఏను ఆదేశించింది.

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రం ఎంతదూరమైనా వెళ్తుందని తెలిపారు. ఇప్పటికే పేపర్ లీకేజీ వ్యవహారంలో అనేక చర్యలు చేపట్టాం అని, ఆ వివరాలను సమగ్రంగా న్యాయస్థానానికి అందిస్తామని, అందుకు కొంత గడువు కల్పించాలని దర్మాసనాన్ని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటిలోగా కేంద్రం, ఎన్టీఏ తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.