ఓటుకు నోటు కేసు..మళ్లీ మొదటి నుంచి !

ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో మళ్లీ మొదటి నుంచి జరగనుంది. పాత ధర్మాసనం న్యాయమూర్తులు రిటైర్ కావడంతో కొత్త బెంచ్ విచారణ చేపట్టనుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 13, 2026, 5:21 pm IST
Read Time: 6 mins
ఓటుకు నోటు కేసు..మళ్లీ మొదటి నుంచి !

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో మళ్లీ మొదటికొచ్చింది. ఈ కేసు తుది విచారణ సమయంలో గతంలో వాదనలు విని, విచారణ జరిపిన ధర్మాసనం న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో, ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి మళ్లీ కొత్తగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. తుది విచారణ సమయంలో జడ్జీలు రిటైర్ కావడంతో పార్ట్ హెడ్ మ్యాటర్ గా గురువారం ఈ కేసు పిటిషన్లు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.

అయితే, ఈ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే పదవీ విరమణ పొందడంతో, నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియ నియమాల ప్రకారం పాత వాదనలను పరిగణనలోకి తీసుకోలేమని..ఈ కేసును కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని, మొదటి నుంచే పూర్తిస్థాయి వాదనలు వింటామని వెల్లడించారు. కేసు విచారణను వాయిదా వేశారు.

సీజేఐ నిర్ణయంతో ఓటుకు నోటు కేసు విచారణకు మరో నూతన బెంచ్ విచారించనున్నందునా..ఈ కేసులో మళ్లీ వాదనలు మొదటి నుంచి వినిపించాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. వచ్చే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వారి పిటిషన్లు కీలకం…

ఓటుకు నోటు కేసులో ముఖ్యంగా రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది. సీఎం రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారించాలని కోరారు. ఈ కేసును క్రిమినల్ అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలని ఆయన వాదించారు.

మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తనపై నమోదైన ఈ కేసులో తన పేరును పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆయన వాదించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

2015 మే 31న, అప్పటి టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి, శాసన మండలి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేమ్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకుగాను, నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షల లంచం ఇస్తున్నారనే ఆరోపణలపై ఏసీబీకి పట్టుబడ్డారు. జూలై 2015లో, అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద ఆరోపించబడిన నేరాలకు గాను రేవంత్ , ఇతరులపై ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడికి వ్యతిరేకంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ల రూపంలో ‘నిశ్చయాత్మకమైన సాక్ష్యాలను’ సేకరించి, రూ. 50 లక్షల అడ్వాన్స్ మొత్తాన్ని రికవరీ చేసినట్లు ఏసీబీ అప్పట్లో పేర్కొంది.