• Telugu News
  • /National

హైవేలపై అంబులెన్స్ సేవల ఆలస్యానికి జరిమానాలు!

జాతీయ రహదారులపై ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో అంబులెన్స్‌ చేరుకోవాలి. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా విధించాలని ఎన్ హెచ్ ఏఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 13, 2026, 4:18 pm IST
Read Time: 4 mins
హైవేలపై అంబులెన్స్ సేవల ఆలస్యానికి జరిమానాలు!

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. హైవేలపై ప్రమాద వార్త సమాచారం అందిన వెంటనే అంబులెన్సులు 10 నిమిషాల్లోనే యాక్సిడెంట్ స్పాట్ కు చేరుకోవాలని ఎన్ హెచ్ ఏఐ గడువు విధించింది. అంబులెన్సులు క్షతగాత్రుల్ని గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి తరలించాలని పేర్కొంది. ఈ గడువును పాటించడంలో ఆలస్యమైతే రూ.10వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

వైద్య సేవలపై నూతన మార్గదర్శకాలు

NHAI కేర్ సిస్టమ్ వినియోగం ద్వారా సంఘటనల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో , అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలతో సహా ఆన్-రోడ్ యూనిట్ల పంపకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థ కొత్త నిబంధనలను విడుదల చేసింది.

ఎక్కడైనా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన ప్రదేశం 10 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎన్‌హెచ్‌ఏఐ తాజా నిబంధనల ప్రకారం అంబులెన్స్ 10 నిమిషాల్లోపు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే, ఆ మేరకు సమయం పెరుగుతుంది. దీనిని GPS డేట, ఎన్‌హెచ్ఏఐ కేర్ డ్యాష్‌బోర్డ్ (NHAI Care Dashboard) ద్వారా నిత్యం పర్యవేక్షిస్తారు. ప్రమాద కాల్ స్వీకరించిన సమయం నుంచి 1 గంటలోపు బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఇందులో ఆలస్యం చేస్తే రూ.10,000 జరిమానా పడనుంది.

అత్యవసర సమయంలో అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ కాల్‌ను తిరస్కరిస్తే కూడా రూ.10 వేల పెనాల్టీ విధిస్తారు. అదేవిధంగా ఒప్పందం ప్రకారం అంబులెన్స్‌లో ఉండాల్సిన వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది లేకపోయినా రూ.10 వేల జరిమానా విధించనున్నారు.

అన్ని అంబులెన్స్‌లు, పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్, ఎన్ హెచ్ ఏఐ కేర్ యాప్ (NHAI Care App) లైవ్‌లో ఉండాలని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. సాంకేతిక లోపాలకు రూ. 2,500 జరిమానా ఉంటుంది. జాతీయ రహదారులపై అత్యవసర సహాయం కోసం 1033 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. NHAI ఆధ్వర్యంలో దాదాపు 50,000 కిలోమీటర్ల రహదారులను పర్యవేక్షించేందుకు, దాదాపు 3,000 అంబులెన్సులు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్‌లు ఉన్నాయి. వీటిన్నింటికీ AIS-140 ప్రమాణాలతో కూడిన GPS పరికరాలను అమర్చారు. అంతేకాకుండా ప్రతి వాహనానికి ఐవోటీ సిమ్‌తో కూడిన ప్రత్యేక ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ను అందించినట్లుగా ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.