స్ట్రెచర్ పై గర్బిణిని వాగు దాటించిన గిరిజనులు

కొమురం భీం జిల్లా కెరమెరిలో ఏడు నెలల గర్భిణిని స్ట్రెచర్‌పై ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు దాటించి ఆసుపత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 13, 2026, 3:13 pm IST
Read Time: 3 mins
స్ట్రెచర్ పై గర్బిణిని వాగు దాటించిన గిరిజనులు

రాకెట్ యుగంలోనూ అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ, గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. ఏజెన్సీ ప్రాంతం కొమురం భీం జిల్లా కెరమెరి మండలానికి చెందిన ఏడు నెలల గర్భిణి కొడప రామేశ్వరికి కడుపునొప్పి రావడంతో ఆమెను ఇద్దరు వ్యక్తులు స్ట్రెచర్‌పై ఉధృతంగా పారుతున్న పెద్దవాగు దాటించి ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. నాగరిక సమాజంలో అభివృద్ధి ఎంత జరిగినా..ఆదివాసీల ప్రాంతాల్లో అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేరే దారి లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటన చూపిస్తోంది.

ఈ సాహస ప్రయాణంలో ఏ మాత్రం పట్టు తప్పిన నీటి ప్రవాహంలో పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికి వారు అత్యవసర వైద్యం కోసం వాగు దాటక తప్పలేదు. ఏజెన్సీ గూడెలకు మధ్య వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర నరకం అనుభవిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆసిఫాబాద్ మారుమూల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.